Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

సామెతలు 6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


మూర్ఖత్వానికి వ్యతిరేకంగా హెచ్చరికలు

1 నా కుమారుడా, నీవు నీ పొరుగువాని రుణానికి భద్రత ఇచ్చివుంటే, చేతిలో చేయి వేసి అపరిచితునికి హామీ ఇచ్చివుంటే,

2 నీవు పలికిన దాని వలన చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు.

3 నా కుమారుడా, నీవు నీ పొరుగువారి చేతుల్లో పడ్డావు, కాబట్టి నిన్ను నీవు విడిపించుకోడానికి ఇలా చేయాలి: వెళ్లి అలసిపోయేవరకు, నీ పొరుగువారికి విశ్రాంతి ఇవ్వకు!

4 నీ కళ్ళకు నిద్ర గాని, నీ కనురెప్పలకు కునుకు గాని రానియ్యకు.

5 వేటగాని చేతి నుండి జింక తప్పించుకున్నట్లుగా, బోయవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లుగా, నీవు తప్పించుకో.

6 సోమరీ, చీమల దగ్గరకు వెళ్లు; అవి నడిచే విధానం చూసి జ్ఞానం తెచ్చుకో.

7 వాటికి అధిపతులు లేరు, పర్యవేక్షించేవారు లేరు, పాలకులు లేరు,

8 అయినా అవి వేసవికాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి, కోతకాలంలో ధాన్యాన్ని దాచుకుంటాయి.

9 సోమరీ, ఎప్పటి వరకు నీవు పడుకుంటావు? ఎప్పుడు నిద్ర లేస్తావు?

10 ఇంకొంచెం నిద్ర, ఇంకొంచెం కునుకు, ఇంకొంచెం సేపు విశ్రాంతి అంటూ చేతులు ముడుచుకుంటాను అంటావు.

11 పేదరికం నీ మీదికి దొంగలా, లేమి ఆయుధాలు ధరించినవానిలా నీ మీదికి వస్తుంది.

12 వంకర మాటలు మాట్లాడుతూ తిరిగేవాడు, పనికిరానివాడు దుష్టత్వం నిండిన మనుష్యుడు.

13 వాడు ద్వేషపూరితంగా కన్నుగీటుతూ, తన పాదాలతో సైగలు చేస్తూ తన వ్రేళ్ళతో సంజ్ఞలు చేస్తాడు.

14 అతడు తన హృదయంలో వికృత ఆలోచనలతో కీడును తలపెడతాడు, అతడు అన్ని సమయాల్లో వివాదాన్ని వ్యాప్తి చేస్తాడు.

15 కాబట్టి దుష్టుని మీదికి విపత్తు అకస్మాత్తుగా వస్తుంది; వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే కూలిపోతాడు.

16 యెహోవాకు హేయమైనవి ఆరు, ఆయనకు హేయమైనవి ఏడు కలవు.

17 అవి ఏమనగా, అహంకారపు కళ్లు, అబద్ధమాడే నాలుక, నిర్దోషులను చంపే చేతులు.

18 చెడ్డ పన్నాగాలు చేసే హృదయం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు,

19 అబద్ధాలు చెప్పే అబద్ధసాక్షి, సమాజంలో గొడవ రేపే వ్యక్తి.


వ్యభిచారానికి వ్యతిరేకంగా హెచ్చరిక

20 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు పాటించు నీ తల్లి ఉపదేశాన్ని త్రోసివేయకు.

21 వాటిని ఎప్పుడు నీ హృదయంలో పదిలంగా ఉంచుకో; నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో.

22 నీవు త్రోవను నడిచేటప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి; నీవు నిద్రించేటప్పుడు అవి నిన్ను కాపాడతాయి. నీవు మేలుకొనునప్పుడు అవి నీతో మాట్లాడతాయి.

23 ఈ ఆజ్ఞ దీపంగా ఈ బోధ వెలుగుగా క్రమశిక్షణ కోసమైన దిద్దుబాట్లుగా జీవమార్గాలుగా ఉండి,

24 వ్యభిచార స్త్రీ దగ్గరకు వెళ్లకుండ దారితప్పిన స్త్రీ పలికే మాటలకు లొంగిపోకుండ నిన్ను కాపాడతాయి.

25 నీ హృదయంలో ఆమె అందాన్ని మోహించకు తన కళ్లతో నిన్ను వశపరచుకోనియ్యకు.

26 ఎందుకంటే ఒక వేశ్యను రొట్టె ముక్కకైనా పొందవచ్చు, కానీ మరొకని భార్య నీ జీవితాన్నే వేటాడుతుంది.

27 ఒక మనుష్యుడు తన బట్టలు కాలకుండ తన ఒడిలో అగ్నిని ఉంచుకోగలడా?

28 తన పాదాలు కాలకుండ ఎవరైనా నిప్పుల మీద నడవగలరా?

29 మరొకని భార్యతో పడుకునే వాడు కూడా అంతే; ఆమెను తాకేవాడు శిక్షను తప్పించుకోలేడు.

30 ఆకలితో అలమటిస్తూ ఉండి ఆకలి తీర్చుకోవడానికి దొంగ దొంగతనం చేస్తే ప్రజలు వాన్ని చులకనగా చూడరు.

31 అయినాసరే వాడు దొరికితే, వాడు ఏడంతలు చెల్లించాలి, దానికి తన ఇంటి సంపదంతా ఖర్చైనా సరే.

32 అయితే వ్యభిచారం చేసే ఒక మనిషికి బుద్ధిలేదు; అలా ఎవరు చేసినా వారు తమను తామే నాశనం చేసుకుంటారు.

33 దెబ్బలు, అవమానం వాని భాగం, వానికి కలిగే అపకీర్తి ఎన్నటికి తొలిగిపోదు.

34 ఎందుకంటే అనుమానం భర్తకు రోషాన్ని పుట్టిస్తుంది, ప్రతీకారం తీర్చుకునేటప్పుడు అతడు కనికరం చూపించడు.

35 అతడు ఏ పరిహారాన్ని అంగీకరించడు; ఎంత ఎక్కువైనా సరే, అతడు లంచాన్ని తిరస్కరిస్తాడు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ