Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

యెహెజ్కేలు 45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


ఇశ్రాయేలు పూర్తి పునరుద్ధరణ

1 “ ‘మీరు భూమిని వారసత్వంగా కేటాయిస్తున్నప్పుడు, మీరు భూమి నుండి ఒక భాగాన్ని యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఆ భాగం పొడవు 25,000 మూరలు, వెడల్పు 20,000 మూరలు ఉండాలి; ఆ స్థలమంతా ప్రతిష్ఠితమవుతుంది.

2 దానిలో పరిశుద్ధస్థలం కోసం 500 మూరల చతురస్రాకార స్థలాన్ని కేటాయించాలి దాని చుట్టూ అన్నివైపులా 50 మూరల మైదానం ఉండాలి.

3 ఈ స్థలం నుండి 25,000 మూరల పొడవు 10,000 మూరల వెడల్పు గల భూమి కొలవాలి. దానిలో అతి పరిశుద్ధ స్థలమైన పరిశుద్ధస్థలం ఉంటుంది.

4 యెహోవాకు పరిచర్య చేయడానికి ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేసే యాజకులకు కేటాయించిన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలమవుతుంది. అది వారి ఇళ్ళకు స్థలంగా పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలంగా ఉంటుంది.

5 25,000 మూరల పొడవు 10,000 మూర వెడల్పు గల స్థలం మందిరంలో సేవచేసే లేవీయులకు స్వాస్థ్యంగా ఇరవై గదులు ఉన్న వారి నివాస స్థలంగా ఉంటుంది.

6 “ ‘పరిశుద్ధ స్థలానికి ఆనుకుని 5,000 మూరల వెడల్పు 25,000 మూరల పొడవు ఉన్న పవిత్ర భాగాన్ని మీరు పట్టణానికి ఆస్తిగా ఇవ్వాలి; అది ఇశ్రాయేలీయులందరికి చెందుతుంది.

7 “ ‘ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి ఎదురుగా, వాటికి పడమర వైపుగా తూర్పు వైపుగా, ప్రతిష్ఠిత భాగానికి పట్టణ భాగానికి రెండు వైపులా ఉన్న భూభాగాన్ని యువరాజుకు కేటాయించాలి. పడమర నుండి తూర్పుకు కొలిచినప్పుడు అది ఒక గోత్ర భాగానికి సరిపడిన పొడవు ఉండాలి.

8 ఈ భూమి ఇశ్రాయేలులో అతనికి స్వాస్థ్యంగా ఉంటుంది. నా అధిపతులు ఇకపై నా ప్రజలను హింసించరు కానీ ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రాల ప్రకారం భూమిని కేటాయించుకోడానికి అనుమతిస్తారు.

9 “ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఇశ్రాయేలు అధిపతులారా! ఇక చాలు. ఇంతవరకు మీరు పెట్టిన హింసను బాధను విడిచిపెట్టి, న్యాయమైనది సరియైనది చేయండి. నా ప్రజలను దోచుకోవడం మానండి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

10 మీరు సరైన త్రాసు సరైన ఏఫాను సరైన బాతును వాడండి.

11 ఏఫా బాతు ఒకే పరిమాణంలో ఉండాలి; హోమెరులో పదవ వంతు ఏఫా, హోమెరులో పదవ వంతు బాతు; హోమెరు రెండింటికీ ప్రామాణిక కొలతగా ఉండాలి.

12 ఒక షెకెలుకు ఇరవై గెరాలు. ఇరవై షెకెళ్లు, ఇరవై అయిదు షెకెళ్లు, పదిహేను షెకెళ్లు కలిపి ఒక మినాకు సమానము.

13 “ ‘మీరు అర్పించవలసిన ప్రత్యేక కానుక ఏంటంటే ప్రతి హోమెరు గోధుమలలో ఒక ఏఫాలో ఆరవ భాగం ప్రతి హోమెరు యవలలో ఒక ఏఫాలో ఆరవ భాగం అర్పించాలి.

14 సూచించిన భాగం బాతులలో కొలత ప్రకారం మీ నూనెలో ప్రతి కోరుకు బాతులో పదోవంతు అర్పించాలి. ఒక కోరు అనగా పది బాతులు లేదా ఒక హోమెరు; అంటే పది బాతులు ఒక హోమెరుకు సమానము.

15 అలాగే ఇశ్రాయేలులో మంచి నీరున్న పచ్చికబయళ్లలో మేపిన మందలోని ప్రతి రెండు వందలకు ఒక గొర్రెను తీసుకోవాలి. ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వీటిని భోజనార్పణలు, దహనబలులు, సమాధాన బలులకు ఉపయోగిస్తారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

16 దేశంలోని ప్రజలందరూ ఇశ్రాయేలులోని యువరాజుకు ఈ ప్రత్యేక కానుక ఇవ్వాలి.

17 పండుగల్లోను, అమావాస్య దినాల్లోను, సబ్బాతు దినాల్లోను, ఇశ్రాయేలీయులు కూడుకునే నియామక కాలాల్లోను వాడబడే దహనబలులను నైవేద్యాలను పానార్పణలను అందించడం అధిపతి యొక్క బాధ్యత. అతడు ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహార బలులు, భోజనార్పణలు, దహనబలులు, సమాధానబలులను సమకూరుస్తాడు.

18 “ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడెను తీసుకుని పరిశుద్ధాలయాన్ని శుద్ధి చేయాలి.

19 యాజకుడు పాపపరిహారబలి రక్తంలో కొంత తీసి దానిని ఆలయ ద్వారబంధాల పైన, బలిపీఠపు పైగట్టు నాలుగు మూలల మీద, లోపలి ఆవరణ ద్వారబంధాల పైన చల్లాలి.

20 అనుకోకుండ గాని అవివేకంతో గాని ఎవరైనా పాపం చేస్తే, అలాంటి వారికి మీరు నెలలో ఏడవ రోజున అదే విధంగా చేయాలి; ఇలా మీరు ఆలయానికి ప్రాయశ్చిత్తం చేయాలి.

21 “ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కా పండుగ ఆచరించాలి, ఆ పండుగ జరిగే ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.

22 ఆ రోజు అధిపతి తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారబలిగా ఒక ఎద్దును అందించాలి.

23 పండుగ జరిగే ఏడు రోజుల్లో ప్రతిరోజు అతడు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఏడు ఎద్దులు ఏడు పొట్టేళ్లను, పాపపరిహారబలిగా ఒక మేకపోతును ఇవ్వాలి.

24 అతడు భోజనార్పణగా ప్రతి కోడెతో పాటు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క కోడెకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క పొట్టేలుకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఏఫా పిండికి ఒక హిన్ ఒలీవ నూనెను కూడా ఇవ్వాలి.

25 “ ‘ఏడవ నెలలో పదిహేనవ రోజున ప్రారంభమయ్యే పండుగ యొక్క ఏడు రోజుల్లో కూడా అతడు పాపపరిహార బలులు, దహనబలులు, భోజనార్పణలు, నూనెను అదే విధంగా ఏర్పాటు చేయాలి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ