Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 సమూయేలు 12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


నాతాను దావీదును గద్దించుట

1 కాబట్టి యెహోవా నాతానును దావీదు దగ్గరకు పంపించారు. అతడు దావీదు దగ్గరకు వచ్చి అతనితో, “ఒక ఊరిలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు మరొకడు పేదవాడు.

2 ధనవంతునికి పెద్ద సంఖ్యలో గొర్రెలు, పశువులు ఉన్నాయి.

3 అయితే పేదవానికి తాను కొనుక్కున్న చిన్న ఆడ గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అతడు దాన్ని పెంచుకున్నాడు. అది అతని దగ్గర అతని పిల్లల దగ్గర పెరుగుతూ, అతని చేతి ముద్దలు తింటూ, అతని గిన్నెలోనిది త్రాగుతూ అతని చేతుల మీద పడుకునేది. అది అతనికి కుమార్తెలా ఉండేది.

4 “ఒక రోజు ఒక బాటసారి ధనవంతుని దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చిన ఆ బాటసారికి విందు చేయడానికి తన గొర్రెలను పశువులను ఉపయోగించడానికి అతడు ఇష్టపడలేదు. దానికి బదులు అతడు ఆ పేదవాని ఆడ గొర్రెను తీసుకుని తన దగ్గరకు వచ్చిన వానికి విందు చేశాడు” అని చెప్పాడు.

5 అది విని దావీదు ఆ ధనవంతునిపై తీవ్ర కోపం తెచ్చుకుని నాతానుతో, “సజీవుడైన యెహోవా మీద ప్రమాణం చేసి చెప్తున్న; ఆ పని చేసినవాడు తప్పనిసరిగా చావాలి!

6 వాడు జాలి లేకుండ అలాంటి పని చేసినందుకు వాడు ఆ గొర్రెపిల్లకు బదులుగా నాలుగు గొర్రెపిల్లలు ఇవ్వాలి” అన్నాడు.

7 అప్పుడు నాతాను దావీదుతో, “ఆ మనిషివి నీవే! ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘నేను నిన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించాను. సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించాను.

8 నీ యజమాని ఇంటిని నీకు అప్పగించాను, అతని భార్యలను నీ కౌగిటిలోనికి చేర్చాను. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలను నీకు అప్పగించాను. ఇవన్నీ చాలవని నీవు అనుకుంటే నేను నీకు మరిన్ని ఇచ్చి ఉండేవాన్ని.

9 యెహోవా దృష్టికి చెడ్డదైన పనిని చేసి ఆయన మాటను ఎందుకు తృణీకరించావు? హిత్తీయుడైన ఊరియాను ఖడ్గంతో చనిపోయేలా చేసి అతని భార్యను నీ సొంతం చేసుకున్నావు. అమ్మోనీయుల ఖడ్గంతో అతడు చనిపోయేలా చేశావు.

10 నీవు నన్ను నిర్లక్ష్యం చేసి హిత్తీయుడైన ఊరియా భార్యను నీ సొంతం చేసుకున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఖడ్గం ఎన్నడూ విడిచిపెట్టదు.’

11 “యెహోవా చెప్పిన మాట ఇదే: ‘నీ సొంత కుటుంబంలో నుండే నేను నీమీదికి గొప్ప ఆపద రప్పిస్తాను. నీవు చూస్తూ ఉండగానే నేను నీ భార్యలను నీకు సన్నిహితులైన వారికి అప్పగిస్తాను. పట్టపగలే అతడు నీ భార్యలతో పడుకుంటాడు.

12 నీవు రహస్యంగా చేశావు గాని, నేనైతే దీన్ని పట్టపగలు ఇశ్రాయేలీయులందరి ముందే జరిగేలా చేస్తాను’ ” అని చెప్పాడు.

13 అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు.

14 కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.

15 తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది.

16 దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు.

17 అతని ఇంట్లోని పెద్దలు అతని ప్రక్కన నిలబడి నేలపై నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కాని అతడు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చేయలేదు.

18 ఏడవ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సలహాదారులు, “బిడ్డ బ్రతికి ఉన్నప్పుడే అతడు మనం చెప్పిన ఏ మాట వినలేదు. బిడ్డ చనిపోయిన విషయం అతనికి ఎలా చెప్పగలం? చెప్తే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో” అనుకుని బిడ్డ చనిపోయిన విషయం అతనికి చెప్పడానికి భయపడ్డారు.

19 తన సలహాదారులు తమలో తాము గుసగుసలాడుకోవడం దావీదు చూసి, బిడ్డ చనిపోయాడని గ్రహించి, “బిడ్డ చనిపోయాడా?” అని అడిగాడు. వారు, “అవును చనిపోయాడు” అని జవాబిచ్చారు.

20 వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు.

21 అతని సలహాదారులు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడ్చారు. కాని ఇప్పుడేమో ఆ బిడ్డ చనిపోయాక లేచి భోజనం చేస్తున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?” అని అతన్ని అడిగారు.

22 అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను.

23 ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.

24 తర్వాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చాడు. అతడు ఆమెతో కలువగా ఆమె కుమారుని కన్నది. దావీదు వానికి సొలొమోను అని పేరు పెట్టాడు. యెహోవా అతన్ని ప్రేమించారు;

25 యెహోవా అతన్ని ప్రేమించారు కాబట్టి అతనికి యెదీద్యా అని పేరు పెట్టమని నాతాను ప్రవక్త ద్వారా కబురు పంపారు.

26 ఇంతలో యోవాబు అమ్మోనీయుల పట్టణమైన రబ్బామీద యుద్ధం చేసి రాజభవనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.

27 యోవాబు దూతల ద్వార ఈ వార్త దావీదుకు పంపిస్తూ, “నేను రబ్బామీద యుద్ధం చేసి ఆ పట్టణపు నీళ్ల సరఫరాను స్వాధీనం చేసుకున్నాను.

28 ఇప్పుడు నీవు మిగిలిన సైన్యాన్ని పంపి పట్టణాన్ని ముట్టడించి దానిని స్వాధీనం చేసుకో. లేకపోతే నేను ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటాను అప్పుడు దానికి నా పేరు పెట్టబడుతుంది” అని కబురు పంపాడు.

29 కాబట్టి దావీదు సైన్యాన్నంతా తీసుకుని రబ్బాకు వెళ్లి దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు.

30 దావీదు వారి రాజు తలమీద నుండి కిరీటాన్ని తీసి తన తలమీద పెట్టుకున్నాడు. అది ఒక తలాంతు బరువు కలిగి ఉండి, ప్రశస్తమైన రాళ్లతో పొదిగించబడి ఉంది. దావీదు ఆ పట్టణం నుండి పెద్ద మొత్తంలో దోపుడుసొమ్ము తీసుకెళ్లాడు.

31 అక్కడి ప్రజలను బయటకు తీసుకువచ్చి రంపతో, పదునైన ఇనుప పనిముట్లతో, గొడ్డళ్ళతో కఠినమైన పని చేయించాడు. ఇటుక బట్టీలలో వారితో పని చేయించాడు. దావీదు అమ్మోనీయుల పట్టణాలన్నిటికి ఈ విధంగా చేశాడు. తర్వాత అతడు అతని సైన్యమంతా యెరూషలేముకు తిరిగి వచ్చారు.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ