Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 రాజులు 1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం


అహజ్యాపై యెహోవా తీర్పు

1 అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసింది.

2 ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు.

3 అయితే యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో, “నీవు వెళ్లి, సమరయ రాజు పంపిన దూతలను కలిసి, ‘ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?’

4 అయితే యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు పడుకున్న మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!’ అని చెప్పు.” కాబట్టి ఏలీయా ఈ వార్త చెప్పడానికి వెళ్లాడు.

5 ఆ దూతలు రాజు దగ్గరకు తిరిగి వెళ్లగా అతడు వారిని, “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు.

6 అందుకు వారు, “ఒక మనుష్యుడు మాకు ఎదురయ్యాడు” అన్నారు. “అందుకతడు మాతో ఇలా అన్నాడు, ‘మీరు వెనక్కి వెళ్లి మిమ్మల్ని పంపించిన రాజుకు ఇలా చెప్పండి, “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపారా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!” ’ ”

7 రాజు వారిని, “మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చి ఈ మాటలు చెప్పిన మనిషి ఎలా ఉంటాడు?” అని అడిగాడు.

8 అందుకు వారు, “అతడు గొంగళి కప్పుకున్నాడు, నడుముకు తోలుతో చేసిన నడికట్టు కట్టుకున్నాడు” అని చెప్పారు. అప్పుడు రాజు, “అతడు తిష్బీయుడైన ఏలీయా” అని అన్నాడు.

9 అప్పుడు రాజు ఒక అధిపతిని, తనతో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఒక కొండమీద కూర్చుని ఉన్న ఏలీయా దగ్గరకు ఆ అధిపతి ఎక్కి వెళ్లి, “దైవజనుడా, ‘క్రిందికి రా!’ అని రాజు చెప్తున్నారు” అని చెప్పాడు.

10 ఏలీయా అధిపతికి జవాబిస్తూ అన్నాడు, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది.

11 అందుకు రాజు వేరొక అధిపతిని, అతనితో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఆ అధిపతి, “దైవజనుడా! రాజు నీతో, ‘వెంటనే క్రిందికి రా!’ అని అన్నారు” అని చెప్పాడు.

12 ఏలీయా జవాబిస్తూ, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది.

13 రాజు మూడవ అధిపతిని అతనితో పాటు యాభైమంది మనుష్యులను పంపాడు. ఈ మూడవ అధిపతి కొండెక్కి వెళ్లి, ఏలీయా ముందు మోకాళ్లమీద ఉండి, “దైవజనుడా” అని వేడుకున్నాడు, “నా ప్రాణాన్ని మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాలను కాపాడండి!

14 చూడండి, ఆకాశం నుండి అగ్ని దిగి ముందు వచ్చిన అధిపతులిద్దరిని వారితో పాటు వచ్చిన మనుష్యులందరిని దహించివేసింది. దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి” అని అతడు బ్రతిమిలాడాడు.

15 యెహోవా దూత ఏలీయాతో, “అతనితో దిగి వెళ్లు; అతనికి భయపడకు” అని చెప్పినప్పుడు ఏలీయా లేచి అతనితో కొండ దిగి రాజు దగ్గరకు వెళ్లాడు.

16 అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు.

17 కాబట్టి ఏలీయా చెప్పిన యెహోవా వాక్కు ప్రకారమే అతడు చనిపోయాడు. అహజ్యాకు కుమారుడు లేనందుకు, యూదాలో రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యోరాము రాజయ్యాడు.

18 అహజ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం

ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

అనుమతితో ఉపయోగించబడింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.

Telugu Contemporary Version, Holy Bible

Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.

Used with permission. All rights reserved worldwide.

Biblica, Inc.
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ