జెకర్యా 14 - పవిత్ర బైబిల్తీర్పు రోజు 1 చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుంది. 2 యెరూషలేము మీదికి దేశాలన్నిటినీ నేను రప్పిస్తాను. వారు నగరాన్ని పట్టుకొని ఇండ్లన్నీ నాశనం చేస్తారు. స్త్రీలు మానభంగం చేయబడతారు. జనాభాలో సగం మంది బందీలుగా పట్టుకుపోబడతారు. కాని, మిగిలిన ప్రజలు నగరంనుండి తీసుకుపోబడరు. 3 అప్పుడు యెహోవా ఆయా దేశాలపైకి యుద్ధానికి వెళతాడు. అది నిజమైన యుద్ధం అవుతుంది. 4 ఆ సమయంలో ఆయన యెరూషలేముకు తూర్పున వున్న ఒలీవల కొండమీద నిలబడతాడు. ఒలీవల కొండ రెండుగా చీలి పోతుంది. ఆ కొండలో ఒక భాగం ఉత్తరానికి, మరొక భాగం దక్షిణానికి తిరుగుతాయి. తూర్పునుండి పడమటికి ఒక లోతైన లోయ ఏర్పడుతుంది. 5 ఆ పర్వతలోయ మీకు మరి సన్నిహితంగా రావటంతో మీరు పారిపోవటానికి ప్రయత్నిస్తారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు మీరు పారిపోయిన రీతిగా మీరిప్పుడు పారిపోతారు. కాని, నా దేవుడైన యెహోవా వస్తాడు. ఆయనయొక్క పవిత్ర జనులందరూ ఆయనతో ఉంటారు. 6-7 అది ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజున వెలుతురుగాని, చలిగాని, మంచుగాని వుండవు. అప్పుడు పగలూ వుండదు, రాత్రీ వుండదు. అది ఎట్లాగో యెహోవా ఒక్కనికే తెలుసు. అప్పుడు మామూలుగా చీకటి పడేటప్పడు ఇంకా కొంత వెలుతురు ఉంటుంది. 8 ఆ సమయంలో యెరూషలేమునుండి నీరు ఎడతెరిపి లేకుండా ప్రవహిస్తుంది. ఆ ప్రవాహం రెండు పాయలై ఒకటి తూర్పుగా పారుతుంది. రెండవది పడమటిగా మధ్యధరా సముద్రంవైపు ప్రవహిస్తుంది. అది సంవత్సరం పొడవునా వేసవిలోను, శీతాకాలంలోను ప్రవహిస్తుంది. 9 ఆ సమయంలో యెహోవా ప్రపంచానికంతటికి రాజుగా వుంటాడు. యెహోవా ఒక్కడే. ఆయనకు పేరు ఒక్కటే. 10 అప్పుడు యెరూషలేము చుట్టూ వున్న ప్రాంతమంతా అరాబా ఎడారిలా నిర్మానుష్య మవుతుంది. గెబ నుండి దక్షిణాన రిమ్మోను వరకు దేశం ఎడారిలా మారిపోతుంది. కాని యెరూషలేము నగరమంతా బెన్యామీను ద్వారం నుండి మొదటి ద్వారం (మూల ద్వారం) వరకు, మరియు హనన్యేలు బురుజు నుండి రాజు యొక్క ద్రాక్ష గానుగల వరకు మళ్లీ నిర్మింపబడుతుంది. 11 నిషేధం తొలగింపబడుతుంది. ప్రజలు మళ్లీ అక్కడ ఇండ్లు కట్టుకుంటారు. యెరూషలేము సురక్షితంగా ఉంటుంది. 12 కాని యెరూషలేముతో యుద్ధం చేసిన దేశాలన్నిటినీ యెహోవా శిక్షిస్తాడు. ఆ మనుష్యులకు ఒక భయంకర వ్యాధి సోకేలా ఆయన చేస్తాడు. ఆ జనులు జీవించి వుండగానే వారి శరీరాలు కుళ్లిపోవటం ప్రారంభిస్తాయి. వారి కండ్లు కనుగుంటలలోనే కుళ్లిపోతాయి. నాలుక నోటిలోనే కుళ్లనారంభిస్తుంది. 13-15 ఆ భయంకర వ్యాధి శత్రు స్థావరంలో ప్రబలుతుంది. పైగా వారి గుర్రాలు, కంచర గాడిదలు, ఒంటెలు మరియు గాడిదలు కూడ ఆ భయంకర వ్యాధికి గురౌతాయి. ఆ సమయంలో ఆ ప్రజలు యెహోవా అంటే నిజంగా భయపడతారు. వారు ఒకరి కొకరు విరోధులై, ఒకరినొకరు పట్టుకుంటారు. యూదా ప్రజలు కూడా యెరూషలేముకు విరుద్ధంగా యుద్ధం చేస్తారు. నగరం చుట్టూవున్న దేశాలనుండి వారికి ధనం లభిస్తుంది. వారికి బంగారం, వెండి, బట్టలు విస్తారంగా లభిస్తాయి. 16 యెరూషలేముపై యుద్ధానికి వచ్చినవారిలో కొంతమంది బ్రతుకుతారు. వారు ప్రతి సంవత్సరం రాజును, సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి వస్తారు. పర్ణశాలల పండుగను చేసుకోటానికి వారు వస్తారు. 17 ఈ భూమిమీద ఏ వంశంవారైనా సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించటానికి యెరూషలేముకు వెళ్ళకపోయినట్లయితే, యెహోవా వారికి వర్షాలు లేకుండా చేస్తాడు. 18 ఈజిప్టు (ఐగుప్తు) నుండి ఏ వంశంవారైనా పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రాకపోయినట్లయితే, యెహోవా శత్రు దేశాలకు సంభవింపజేసిన ఆ భయంకర వ్యాధి వారికి సోకేలా చేస్తాడు. 19 పర్ణశాలల పండుగ జరుపుకోటానికి రానటువంటి ఈజిప్టుకు, మరి ఏ ఇతర దేశానికైనా అదే శిక్ష. 20 ఆ సమయంలో ప్రతిదీ దేవునికి చెందివుంటుంది. గుర్రాలమీది జీనులకు కూడ “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసిన చీటీలు కట్టబడతాయి. బలిపీఠంవద్ద వుంచబడిన గిన్నెలవలె యెహోవా ఆలయంలో వాడబడే పాత్రలన్నీ ప్రాముఖ్యంగల వస్తువులే. 21 వాస్తవానికి యెరూషలేము, యూదాలలోగల ప్రతి పాత్రమీద “సర్వశక్తిమంతుడైన యెహోవాకు పవిత్రమైనది” అని వ్రానిన చీటి అంటించబడుతుంది. యెహోవాను ఆరాధించే ప్రతి వ్యక్తి ఆ పాత్రలలో వండి, తినగలిగినవారై ఉంటారు. ఆ సమయంలో సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారస్తులెవ్వరూ వుండరు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International