పరమగీతము 6 - పవిత్ర బైబిల్యెరూషలేము స్త్రీలు ఆమెకు చెప్తారు 1 అతి సుందరవతీ, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? ఏ దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని సంగతి మాకు చెప్పు, వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము. ఆమె వారికిచ్చిన సమాధానం 2 సుగంధ పుష్పాల ఉద్యాన వనానికి నా ప్రియుడు వెళ్లాడు. తన సుగంధాలు వెదజల్లు పూలమొక్కల తోటకు గొర్రెలు మేపడానికి వెళ్లాడు 3 నేను ఎర్రని పుష్పాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను. నా ప్రియుడు నా వాడు. అతడు ఆమెతో అంటాడు 4 ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైనదానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి. 5 నీవు నా వైపు చూడకు! నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి. 6 గొడ్డువి కాక, కవలపిల్లల్ని కలిగి, కత్తరించబడి, కడుగబడి, పైకి వస్తున్న తెల్ల గొర్రె మందల్ని పోలినవి నీ పళ్లు. 7 నీమేలి ముసుగు క్రింద నీ కణతలు దానిమ్మ చెక్కల్లా వున్నాయి. 8 అరవై మంది రాణులు ఎనభై మంది సేవకురాండ్రు లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు. 9 కాని, నా పావురము, నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. తన కన్న తల్లికి గారాల చిన్నది. కన్యలు, రాణులు, సేవకురాండ్రు కూడా ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు. ఆమెకు స్త్రీల ప్రశంసలు 10 ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనలంతటి విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు? అతడు ఆమెతో మాట్లాడుతాడు 11 నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో చూసేందుకు ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు, 12 నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది యెరూషలేము స్త్రీలు ఆమెను పిలుస్తారు 13 షూలమ్మీతీ తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము నాట్యము చేస్తూండగా షూలమ్మీతీని ఎందుకు చూస్తారు? |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International