కీర్తన 97 - పవిత్ర బైబిల్1 యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది. దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి. 2 దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి. నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి. 3 యెహోవా ముందర అగ్ని బయలువెళ్తూ ఆయన శత్రువులను నాశనం చేస్తుంది. 4 ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది. ప్రజలు దాన్ని చూచి భయపడతారు. 5 యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగిపోతాయి. భూలోక ప్రభువు ఎదుట అవి కరిగిపోతాయి. 6 ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి. ప్రతి మనిషీ దేవుని మహిమను చూచును గాక! 7 మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు. వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు. కాని ఆ ప్రజలు యిబ్బంది పడతారు. వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు. 8 సీయోనూ, విని సంతోషించుము! యూదా పట్టణములారా, సంతోషించండి! ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు. 9 సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు. ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు. 10 యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు. కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు. 11 మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి. 12 మంచి మనుష్యులారా, యెహోవాయందు ఆనందించండి. ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International