Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 92 - పవిత్ర బైబిల్


సబ్బాతుకోసం స్తుతి కీర్తన.

1 యెహోవాను స్తుతించుట మంచిది. సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.

2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం, రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.

3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది. సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.

4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు. నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.

5 యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు. నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.

6 నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు. మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.

7 దుర్మార్గులు గడ్డిలా మొలిచినా, చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.

8 కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.

9 యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు. చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.

10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు. సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.

11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను. నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.

12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు. వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.

13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు. వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.

14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు. వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.

15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను. ఆయనే నా బండ. ఆయనలో అవినీతి లేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ