Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 80 - పవిత్ర బైబిల్


సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.

1 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము. యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము. కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.

2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము. వచ్చి మమ్మల్ని రక్షించుము.

3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము. మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.

4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా? మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?

5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు. నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.

6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు. మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.

7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము. నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.

8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు. ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు. ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు. నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.

9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు. దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.

10 అది పర్వతాలను కప్పివేసింది. దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.

11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.

12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు? ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.

13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి. అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.

14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము. పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.

15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము. నీవు పెంచిన ఆ లేత మొక్కలను చూడుము.

16 అగ్నితో నీ “ద్రాక్షావల్లి” కాల్చివేయబడింది. నీవు దానిమీద కోపగించి నీవు దాన్ని నాశనం చేశావు.

17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము. నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.

18 అతడు మరల నిన్ను విడువడు. అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.

19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము. నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ