కీర్తన 74 - పవిత్ర బైబిల్ఆసాపు ధ్యాన గీతం. 1 దేవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టేశావా? నీవు నీ ప్రజల మీద ఇంకా కోపంగా ఉన్నావా? 2 చాలా కాలం క్రిందట నీవు కొన్న ప్రజలను జ్ఞాపకం చేసుకో. నీవు మమ్మల్ని రక్షించావు. మేము నీకు చెందినవాళ్లం. నీ నివాస స్థానమైన సీయోను పర్వతాన్ని జ్ఞాపకముంచుకొనుము. 3 దేవా, నీవు వచ్చి ఈ పురాతన శిథిలాల మధ్య నడువుము. శత్రువు నాశనం చేసిన పవిత్ర స్థలానికి మరలా రమ్ము. 4 శత్రువులు ఆలయంలో యుద్ధపు కేకలు వేసారు. యుద్ధంలో తాము గెలిచినట్లు చూపించుటకు వారు జెండాలను ఆలయంలో ఉంచారు. 5 శత్రుసైనికులు గొడ్డలితో కలుపు మొక్కలను నరికే మనుష్యుల్లా ఉన్నారు. 6 ఈ సైనికులు తమ గొడ్డళ్లను సమ్మెటలను ప్రయోగించి దేవా, నీ ఆలయంలోని నగిషీ గల చెక్క పనిని నరికివేశారు. 7 దేవా, ఆ సైనికులు నీ పవిత్ర స్థలాన్ని కాల్చివేశారు. వారు నీ ఆలయాన్ని నేలమట్టంగా కూల్చివేశారు. ఆ ఆలయం నీ నామ ఘనత కోసం నిర్మించబడింది. 8 శత్రువు మమ్మల్ని పూర్తిగా చితుకగొట్టాలని నిర్ణయించాడు. దేశంలోని ప్రతి ఆరాధనా స్థలాన్నీ వారు కాల్చివేసారు. 9 మా సొంత గుర్తులు ఏవీ మేము చూడలేక పోయాము. ఇంకా ప్రవక్తలు ఎవరూ లేరు. ఏమి చేయాలో ఎవ్వరికీ తెలియదు. 10 దేవా, ఇకెంత కాలం శత్రువు మమ్మల్ని ఎగతాళి చేస్తాడు? నీ శత్రువు నీ నామమును శాశ్వతంగా అవమానించనిస్తావా? 11 దేవా, నీవెందుకు మమ్మల్ని అంత కఠినంగా శిక్షించావు? నీవు నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని పూర్తిగా నాశనం చేశావు. 12 దేవా, చాల కాలంగా నీవే మా రాజువు. నీవు ఎల్లప్పుడూ మమ్ములను విడుదలచేసి నీవు భూమిమీద రక్షణ తెస్తావు. 13 దేవా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసేందుకు నీవు నీ మహా శక్తిని ప్రయోగించావు. 14 మకరపు తలను నీవు చితుకగొట్టావు. దాని శరీరాన్ని అడవి జంతువులు తినివేయుటకు విడిచిపెట్టావు. 15 జల ఊటలను, భూగర్భ జలాన్ని నీవు తెరచి ప్రపంచాన్ని వరదపాలు చేశావు. మరియు నదులు ఎండిపోవునట్లు నీవు చేశావు. 16 దేవా, పగటిని నీవు ఏలుతున్నావు. మరియు రాత్రిని నీవు ఏలుతున్నావు. సూర్యుని, చంద్రుని నీవే చేశావు. 17 భూమి మీద ఉన్న సమస్తానికీ నీవే హద్దులు నియమించావు. వేసవికాలం, చలికాలం నీవే సృష్టించావు. 18 దేవా, ఈ సంగతులు జ్ఞాపకం చేసుకో. మరియు శత్రువు నిన్ను అవమానించాడని జ్ఞాపకం చేసుకో. ఆ తెలివితక్కువ ప్రజలు నీ నామాన్ని ద్వేషిస్తారు. 19 దేవా, ఆ అడవి మృగాలను నీ పావురాన్ని తీసుకోనివ్వకుము. నీ పేద ప్రజలను శాశ్వతంగా మరచిపోకుము. 20 నీ ఒడంబడికను జ్ఞాపకం చేసుకొనుము. ఈ దేశంలోని ప్రతి చీకటి స్థలంలోనూ బలాత్కారమే ఉంది. 21 దేవా, నీ ప్రజలకు అవమానం కలిగింది. వారిని ఇంకెంత మాత్రం బాధపడనివ్వకుము. నిస్సహాయులైన నీ పేద ప్రజలు నిన్ను స్తుతిస్తారు. 22 దేవా, లేచి పోరాడుము. ఆ తెలివితక్కువ ప్రజలు ఎల్లప్పుడూ నిన్ను అవమానించారని జ్ఞాపకం చేసుకొనుము. 23 ప్రతి రోజూ నీ శత్రువులు నిన్ను గూర్చి చెప్పిన చెడు సంగతులు మరచిపోకుము. ఎడతెగక నీ శత్రువులు చేసే గర్జనను మరువవద్దు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International