కీర్తన 66 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన. 1 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము! 2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి. స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి. 3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి: దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం. 4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక. నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక. 5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. 6 సముద్రాన్ని ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు. ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు. అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు. 7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు. సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు. ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు. 8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి. స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి. 9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. 10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. 11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు. భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు. 12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు. అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు. కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు. 13-14 కనుక నేను నీ ఆలయానికి బలులు తీసుకొస్తాను. నేను కష్టంలో ఉన్నప్పుడు నిన్ను నేను సహాయం కోసం అడిగాను. నేను నీకు చాల వాగ్దానాలు చేసాను. ఇప్పుడు, నేను వాగ్దానం చేసినవాటిని నీకు ఇస్తున్నాను. 15 నేను నీకు పాపపరిహారార్థ బలులు ఇస్తున్నాను. నేను నీకు పొట్టేళ్లతో ధూపం ఇస్తున్నాను. నేను నీకు ఎద్దులను, మేకలను ఇస్తున్నాను. 16 దేవుని ఆరాధించే ప్రజలారా, మీరంతా రండి. దేవుడు నా కోసం ఏమి చేసాడో నేను మీతో చెబుతాను. 17 నేను ఆయన్ని ప్రార్థించాను. నేను ఆయన్ని స్తుతించాను. 18 నా హృదయం పవిత్రంగా ఉంది. కనుక నా యెహోవా నా మాట విన్నాడు. 19 దేవుడు నా మొరను విన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. 20 దేవుని స్తుతించండి! దేవుడు నాకు విముఖుడు కాలేదు. ఆయన నా ప్రార్థన విన్నాడు. దేవుడు తన ప్రేమను నాకు చూపించాడు! |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International