కీర్తన 65 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన. 1 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను. నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను. 2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు. నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు. 3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు, ఆ పాపాలను నీవు తీసివేస్తావు. 4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి. 5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు. 6 దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు. మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము. 7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు. మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు. 8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు. దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు. 9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు. నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు. దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు. నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు. 10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు. భూములను నీవు నీళ్లతో నానబెడతావు. నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు. అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు. 11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు. బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు. 12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి. 13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి. లోయలు ధాన్యంతో నిండిపోయాయి. పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International