కీర్తన 61 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన. 1 దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము. 2 నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము. 3 నీవే నా క్షేమ స్థానం. నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే. 4 నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను. 5 దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు. కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది. 6 రాజుకు దీర్ఘాయుష్షు దయచేయుము. అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము. 7 అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము. నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము. 8 నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను. నేను ప్రమాణం చేసినవాటిని ప్రతి రోజూ చేస్తాను. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International