కీర్తన 44 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: కోరహు కుటుంబంవారి దైవ ధ్యానం. 1 దేవా, నిన్ను గూర్చి మేము విన్నాము. మా పూర్వీకుల కాలంలో నీవు చేసిన కార్యాలను గూర్చి మా తండ్రులు మాతో చెప్పారు. చాలా కాలం క్రిందట నీవు చేసిన వాటిని గూర్చి వారు మాతో చెప్పారు. 2 దేవా, నీ మహా శక్తితో ఇతరుల నుండి ఈ దేశాన్ని నీవు తీసుకొన్నావు. మరియు మా తండ్రులను ఇక్కడ ఉంచావు. ఆ విదేశీ ప్రజలను నీవు చితుకగొట్టావు. వారు ఈ దేశం వదిలిపెట్టేలా బలవంతం చేశావు. నీవు మా తండ్రులను స్వతంత్రులుగా చేశావు. 3 ఈ దేశాన్ని మా తండ్రుల ఖడ్గాలు స్వాధీనం చేసికోలేదు. వారిని విజేతలుగా చేసింది వారి బలమైన హస్తాలు కావు. నీవు మా తండ్రులకు తోడుగా ఉన్న కారణం చేతనే అది జరిగింది. దేవా, నీ మహా శక్తి మా తండ్రులను రక్షించింది. ఎందుకంటే వారిని నీవు ప్రేమించావు గనుకనే! 4 నా దేవా, నీవు నా రాజువు. నీ ఆజ్ఞలే యాకోబు ప్రజలను విజయానికి నడిపించాయి. 5 నా దేవా, నీ సహాయంతో మా శత్రువులను మేము వెనుకకు త్రోసివేసాము. నీ నామంతో, మా శత్రువుల మీదుగా మేము నడిచాము. 6 నా విల్లును, బాణాలను నేను నమ్ముకోను. నా ఖడ్గం నన్ను రక్షించజాలదు. 7 దేవా, మా విరోధుల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. మా శత్రువుల్ని నీవు సిగ్గుపరచావు. 8 మేము ప్రతిరోజూ దేవుని స్తుతిస్తాము! నీ నామాన్ని శాశ్వతంగా మేము స్తుతిస్తాము! 9 కాని, దేవా, నీవు మమ్మల్ని విడిచిపెట్టావు. నీవు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు. నీవు మాతో కూడ యుద్ధంలోనికి రాలేదు. 10 మా శత్రువులు మమ్మల్ని వెనుకకు నెట్టివేయనిచ్చావు. మా శత్రువులు మా ఐశ్వర్యాన్ని దోచుకున్నారు. 11 గొర్రెల్ని ఆహారంగా తినుటకు ఇచ్చినట్టు నీవు మమ్మల్నిచ్చి వేశావు. రాజ్యాల మధ్య నీవు మమ్మల్ని చెదరగొట్టావు. 12 దేవా, నీ ప్రజలను నీవు విలువ లేకుండా అమ్మివేశావు. ధర విషయం నీవేమీ వాదించలేదు. 13 మా యిరుగు పొరుగు వారికి నీవు మమ్మల్ని హాస్యాస్పదం చేశావు. మా యిరుగు పొరుగు వారు మమ్మల్ని చూచి నవ్వుతూ హేళన చేస్తారు. 14 మేము ప్రజలు చెప్పుకొనే హాస్యాస్పద కథలలో పాత్రల్లా ఉన్నాము. ప్రజలు మమ్మల్ని చూచి నవ్వుతూ వారి తలలు ఊపుతారు. 15 నేను సిగ్గుతో కప్పబడి ఉన్నాను. రోజంతా నా అవమానాన్ని నేను చూస్తున్నాను. 16 నా శత్రువు నన్ను ఇబ్బంది పెట్టాడు. నా శత్రువు నన్ను హేళన చేయడం ద్వారా నా మీద కక్ష సాధిస్తున్నాడు. 17 దేవా, మేము నిన్ను మరచిపోలేదు. అయినప్పటికీ వాటన్నిటినీ నీవు మాకు చేస్తున్నావు. మేము నీతో మా ఒడంబడికపై సంతకం చేసినప్పుడు మేము అబద్ధమాడలేదు! 18 దేవా, మేము నీ నుండి తిరిగిపోలేదు. నిన్ను అనుసరించటం మేము మానుకోలేదు. 19 కాని, దేవా, నక్కలు నివసించే ఈ స్థలంలో నీవు మమ్మల్ని చితుక గొట్టావు. మరణం అంత చీకటిగా ఉన్న ఈ స్థలంలో నీవు మమ్మల్ని కప్పివేశావు. 20 మా దేవుని పేరు మేము మరచిపోయామా? అన్యదేవతలకు మేము ప్రార్థించామా? లేదు! 21 నిజంగా ఈ విషయాలు దేవునికి తెలుసు. లోతైన రహస్యాలు సహితం ఆయనకు తెలుసు. 22 దేవా, నీకోసం ప్రతి రోజూ చంపబడుతున్నాము! చంపటానికి నడిపించబడే గొర్రెల్లా ఉన్నాము మేము. 23 నా ప్రభువా, లెమ్ము! నీవేల నిద్రపోతున్నావు? లెమ్ము! మమ్ముల్ని శాశ్వతంగా విడిచిపెట్టకుము! 24 దేవా, మానుండి నీవేల దాక్కుంటున్నావు? మా బాధ, కష్టాలు నీవు ఎందుకు మరచిపోయావు? 25 బురదలోకి మేము త్రోసివేయబడ్డాము. మేము దుమ్ములో బోర్లాపడి ఉన్నాము. 26 దేవా, లేచి మాకు సహాయం చేయుము! నీ మంచితనాన్ని బట్టి మమ్మల్ని రక్షించుము. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International