కీర్తన 41 - పవిత్ర బైబిల్సంగీత నాయకునికి: దావీదు కీర్తన 1 పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు. కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు. 2 ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు. ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు. 3 ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కాని యెహోవా అతనిని బాగుచేస్తాడు. 4 నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము. నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.” 5 నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు. “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు. 6 కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు. కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు. ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమే వస్తారు, మరియు వారు వెళ్లి, వారి గాలి కబుర్లు ప్రచారం చేస్తారు. 7 నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబుతారు. వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు. 8 “ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడు రోగి అయ్యాడు. ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు. 9 నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు. నేను అతన్ని నమ్మాను. కాని ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు. 10 కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము. అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను. 11 యెహోవా, నా శత్రువులు నన్ను భాధించని యెడల అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను. 12 నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి. నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు. 13 ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు. ఆమేన్! ఆమేన్! |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International