కీర్తన 24 - పవిత్ర బైబిల్దావీదు కీర్తన. 1 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే. ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే. 2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు. ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు. 3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు? యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు? 4 అక్కడ ఎవరు ఆరాధించగలరు? చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ, అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు, అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు. అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు. 5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు. ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు. 6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు. సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు. 7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి. పురాతన తలుపుల్లారా తెరచుకోండి. మహిమగల రాజు లోనికి వస్తాడు. 8 ఈ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి. యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు. 9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి! పురాతన తలుపుల్లారా, తెరచుకోండి. మహిమగల రాజు లోనికి వస్తాడు. 10 ఆ మహిమగల రాజు ఎవరు? ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International