కీర్తన 148 - పవిత్ర బైబిల్1 యెహోవాను స్తుతించండి! పైన ఉన్న దూతలారా, ఆకాశంలో యెహోవాను స్తుతించండి! 2 సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! ఆయన సర్వ సైనికులారా, ఆయనను స్తుతించండి! 3 సూర్యచంద్రులారా, యెహోవాను స్తుతించండి. ఆకాశంలోని నక్షత్రాలూ, వెలుతురూ యెహోవాను స్తుతించండి! 4 మహా ఉన్నతమైన ఆకాశంలోని యెహోవాను స్తుతించండి. ఆకాశం పైగా ఉన్న జలములారా, ఆయనను స్తుతించండి. 5 యెహోవా నామాన్ని స్తుతించండి. ఎందుకనగా దేవుడు ఆజ్ఞ యివ్వగా ప్రతి ఒక్కటీ సృష్టించబడింది. 6 ఇవన్నీ శాశ్వతంగా కొనసాగేందుకు దేవుడు చేశాడు. ఎన్నటికి అంతంకాని న్యాయచట్టాలను దేవుడు చేశాడు. 7 భూమి మీద ఉన్న సమస్తమా. యెహోవాను స్తుతించు! మహా సముద్రాలలోని గొప్ప సముద్ర జంతువుల్లారా, యెహోవాను స్తుతించండి. 8 అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను, గాలులు అన్నింటినీ దేవుడు చేశాడు. 9 పర్వతాలను, కొండలను, ఫలవృక్షాలను, దేవదారు వృక్షాలను దేవుడు చేశాడు. 10 అడవి జంతువులను, పశువులను, పాకే ప్రాణులను, పక్షులను అన్నింటినీ దేవుడు చేశాడు. 11 భూమి మీద రాజ్యాలను రాజులను దేవుడు చేశాడు. నాయకులను, న్యాయాధిపతులను దేవుడు చేశాడు. 12 యువతీ యువకులను దేవుడు చేశాడు. వృద్ధులను, యవ్వనులను దేవుడు చేశాడు. 13 యెహోవా నామాన్ని స్తుతించండి! ఆయన నామాన్ని శాశ్వతంగా ఘనపర్చండి! భూమిపైన, ఆకాశంలోను ఉన్న సమస్తం ఆయనను స్తుతించండి! 14 దేవుడు తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు. దేవుని అనుచరులను మనుష్యులు పొగడుతారు. ఎవరి పక్షంగా అయితే దేవుడు పోరాడుతున్నాడో ఆ ఇశ్రాయేలీయులను మనుష్యులు పొగడుతారు. యెహోవాను స్తుతించండి! |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International