కీర్తన 115 - పవిత్ర బైబిల్1 యెహోవా, ఏ ఘనతా మేము స్వీకరించకూడదు. ఘనత నీకే చెందుతుంది. నీ ప్రేమ, నమ్మకం మూలంగా ఘనత నీదే. 2 మా దేవుడు ఎక్కడ అని జనాంగాలు ఎందుకు ఆశ్చర్యపడాలి? 3 దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఆయన కోరింది చేస్తాడు. 4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి. 5 ఆ విగ్రహాలకు నోళ్లున్నాయి కాని అవి మాట్లాడలేవు. వాటికి కళ్లున్నాయి కాని అవి చూడలేవు. 6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు. వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు. 7 వాటికి చేతులు ఉన్నాయి కాని అవి తాకలేవు. వాటికి కాళ్లు ఉన్నాయి కాని అవి నడవలేవు. వాటికి గొంతుల్లోనుంచి ఏ శబ్దాలూ రావు. 8 ఆ విగ్రహాలను చేసేవారు. వాటిని నమ్ముకొనే వారు కూడ సరిగ్గా వాటివలె అవుతారు. 9 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ము. యెహోవా వారి బలము, ఆయన వారి డాలు. 10 అహరోను వంశస్థులు యెహోవాను నమ్ముతారు. యెహోవా వారి బలము, డాలు అయివున్నాడు. 11 యెహోవా అనుచరులు యెహోవాను నమ్ముకొంటారు. యెహోవా తన అనుచరులకు సహాయం చేసి కాపాడుతాడు. 12 యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసికొంటాడు. యెహోవా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. యెహోవా అహరోను వంశాన్ని ఆశీర్వదిస్తాడు. 13 యెహోవా పెద్దవారైనా, చిన్నవారైనా తన అనుచరులను ఆశీర్వదిస్తాడు. 14 యెహోవా మీ కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. ఆయన మీ పిల్లల కుటుంబాలను పెద్దవిగా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. 15 యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆకాశాన్ని, భూమిని యెహోవా చేశాడు. 16 ఆకాశం యెహోవాకు చెందుతుంది. కాని భూమిని ఆయన మనుష్యులకు ఇచ్చాడు. 17 చనిపోయినవాళ్లు యెహోవాను స్తుతించరు. కింద సమాధిలో ఉన్న మనుష్యులు యెహోవాను స్తుతించరు. 18 అయితే మనం యెహోవాను స్తుతిస్తాం. మనం యిప్పటినుండి ఎప్పటికీ ఆయనను స్తుతిస్తాము! యెహోవాను స్తుతించండి! |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International