కీర్తన 102 - పవిత్ర బైబిల్శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది. 1 యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెడుతున్న నా మొర వినుము. 2 యెహోవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు నా నుండి తిరిగి పోకుము. నా మాట వినుము. సహాయం కోసం నేను మొర పెట్టినప్పుడు వెంటనే నాకు జవాబు ఇమ్ము. 3 పొగ వెళ్లినట్లుగా నా జీవితం వెళ్లిపోతుంది. నా జీవితం నిదానంగా కాలిపోతున్న మంటలా ఉంది. 4 నా బలం పోయింది. నేను ఎండిపోయి చస్తున్న గడ్డిలా ఉన్నాను. నా కష్టాల మూలంగా నేను నా ఆహారాన్ని తినటం కూడా మరచిపోయాను. 5 నా విచారం వల్ల నా బరువు తగ్గిపోతూంది. 6 అరణ్యంలో నివసిస్తున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. శిథిలమైన పాత కట్టడాలలో బ్రతుకుతున్న గుడ్లగూబలా నేను ఒంటరిగా ఉన్నాను. 7 నేను నిద్రపోలేను. పై కప్పు మీద ఒంటరిగా నివసించే పక్షిలా నేను ఉన్నాను. 8 నా శత్రువులు నన్ను ఎల్లప్పుడూ అవమానిస్తారు. నన్ను హేళన చేసే మనుష్యులు నన్ను శపించేటప్పుడు నా పేరు ప్రయోగిస్తారు. 9 నా అధిక విచారమే నా భోజనం. నా కన్నీళ్లు నా పానీయాల్లో పడతాయి. 10 ఎందుకంటే, నీవు నా మీద కోపగించావు. యెహోవా, నీవు నన్ను లేవనెత్తావు, నీవు నన్ను క్రిందకు విసిరేశావు. 11 సాయంకాలమయ్యేసరికి దీర్ఘమైన నీడలు అంతం అయిపోయినట్లు, నా జీవితం దాదాపుగా అంతం అయిపోయింది. నేను ఎండిపోయి వాడిన గడ్డిలా ఉన్నాను. 12 అయితే యెహోవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. నీ నామం శాశ్వతంగా కొనసాగుతుంది. 13 నీవు లేచి సీయోనును ఆదరిస్తావు. నీవు సీయోను యెడల దయగా ఉండే సమయం వస్తూంది. 14 యెరూషలేము పట్టణపు రాళ్లను వారు ప్రేమిస్తారు. 15 జనసముదాయాలు యెహోవా నామాన్ని ఆరాధిస్తారు. దేవా, భూమి మీద రాజులందరూ నిన్ను గౌరవిస్తారు. 16 ఎందుకంటే యెహోవా సీయోనును మరల నిర్మిస్తాడు. యెరూషలేము మహిమను ప్రజలు మరల చూస్తారు. 17 దేవుడు సజీవులుగా విడిచిపెట్టిన ప్రజల ప్రార్థనలు వింటాడు. దేవుడు వారి ప్రార్థనలు వింటాడు. 18 రాబోయే తరంవారు చదువుకొనేందుకు ఈ సంగతులు రాసిపెట్టు. అప్పుడు, భవిష్యత్తులో ఆ ప్రజలు యెహోవాను స్తుతిస్తారు. 19 యెహోవా పైనున్న తన పవిత్ర స్థానం నుండి క్రిందకు చూస్తాడు. యెహోవా పరలోకం నుండి క్రింద భూమిని చూస్తాడు. 20 ఖైదీల ప్రార్థనలు ఆయన వింటాడు. మరణశిక్ష విధించబడిన ప్రజలను ఆయన విడుదల చేస్తాడు. 21 సీయోను ప్రజలు యెహోవాను గూర్చి చెబుతారు. వారు యెహోవా నామాన్ని యెరూషలేములో స్మరిస్తారు. 22 జనసమూహములు కలిసి పోగుచేయబడునప్పుడు రాజ్యాలు యెహోవాకు సేవచేయటానికి వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. 23 నాలో బలం పోయింది. నా జీవితం తక్కువగా చేయబడింది. 24 కనుక నేను ఇలా చెప్పాను, “నేను ఇంకా యువకునిగా ఉండగానే నన్ను చావనివ్వకు. దేవా, నీవు శాశ్వతంగా జీవిస్తావు. 25 చాలా కాలం క్రిందట నీవు ప్రపంచాన్ని సృష్టించావు. ఆకాశాన్ని నీ స్వహస్తాలతో చేశావు. 26 ప్రపంచం, ఆకాశం అంతం ఆవుతాయి. కాని నీవు శాశ్వతంగా జీవిస్తావు. అవి బట్టల్లా పాడైపోతాయి. మరియు వస్త్రాలు మార్చినట్టుగా నీవు వాటిని మార్చివేస్తావు. అవన్నీ మార్చివేయబడతాయి. 27 కాని, దేవా, నీవు ఎన్నటికీ మారవు. నీవు శాశ్వతంగా జీవిస్తావు! 28 ఈ వేళ మేము నీ సేవకులము. భవిష్యత్తులో మా సంతతి వారిక్కడ నివసిస్తారు. మరియు వారి సంతతి వారిక్కడ నిన్ను ఆరాధిస్తారు.” |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International