సామెతలు 9 - పవిత్ర బైబిల్జ్ఞానము ఆహ్వానించుట 1 జ్ఞానము తన నివాసమును కట్టుకొనెను. దానికి ఏడు స్తంభములను ఆమె నిలబెట్టెను. 2 ఆమె (జ్ఞానము) భోజనం సిద్ధం చేసి, ద్రాక్షారసమును కలిపి, భోజనమును బల్లపైఉంచెను. 3 అప్పుడు ఆమె (జ్ఞానము) తన సేవకులను, ప్రజలను నగరములోని ఎత్తయిన స్థలమునకు తనతో పాటు తినుటకు ఆహ్వానించెను. కొండ మీదికి వచ్చి, ఆమెతో కూడ భోజనం చేసేందుకు మనుష్యులను ఆహ్వానించుటకు తన సేవకులను ఊళ్లోనికి పంపింది. 4 “నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న మనుష్యులారా, మీరు రండి” అని ఆమె చెప్పింది. బుద్దిహీనులను కూడా ఆమె పిలిచింది. 5 “నా జ్ఞాన భోజనం ఆరగించండి, రండి. నేను చేసిన ద్రాక్షారసం తాగండి. 6 మీ పాత బుద్ధిహీన పద్ధతులు విడిచి పెట్టండి. మీకు జీవం ఉంటుంది. తెలివిగల మార్గాన్ని అనుసరించండి” అని ఆమె చెప్పింది. 7 ఒక గర్విష్ఠికి, అతడు చేసింది తప్పు అని చూపించటానికి నువ్వు ప్రయత్నిస్తే అతడు నిన్నే విమర్శిస్తాడు. ఆ మనిషి దేవుని జ్ఞానము గూర్చి హేళన చేస్తాడు. ఒక దుర్మార్గుడిదే తప్పని నీవు చెబితే అతడు నిన్ను హేళన చేస్తాడు. 8 కనుక ఒకడు ఇతరుల కంటే తాను మంచి వాడినని తలిస్తే అతనిది తప్పు అని అతనికి చెప్పవద్దు. దానివల్ల అతడు నిన్ను ద్వేషిస్తాడు. కాని జ్ఞానముగల ఒక మనిషికి సహాయం చేయటానికి నీవు ప్రయత్నిస్తే అతడు నిన్ను గౌరవిస్తాడు. 9 జ్ఞానముగల ఒక మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా జ్ఞానము గలవాడవుతాడు. ఒకవేళ మంచి మనిషికి నీవు ఉపదేశము చేస్తే అతడు ఇంకా ఎక్కువ నేర్చుకుంటాడు. 10 యెహోవా యెడల భయము కలిగి యుండుట జ్ఞానము సంపాదించుటకు మొదటి మెట్టు. యెహోవాను గూర్చిన జ్ఞానము తెలివి సంపాదించుటకు మొదటి మెట్టు. 11 నీకు జ్ఞానము ఉంటే అప్పుడు నీ జీవితం ఎక్కువ కాలం ఉంటుంది. 12 నీవు జ్ఞానివి అయితే నీ మంచి కోసమే నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. కాని నీవు గర్వంగలవాడవై, యితరులను హేళన చేస్తే అప్పుడు నీ కష్టానికి నిన్ను నీవే నిందించుకోవాలి. బుద్ధిహీనత — ఇతర స్త్రీ 13 బుద్ధిహీనుడు గట్టిగా అరిచే చెడు స్త్రీలాంటివాడు. ఆమెకు తెలివి లేదు. 14 ఆమె తన ఇంటి గుమ్మంలో కూర్చుంటుంది. పట్టణంలో కొండ మీద తన కుర్చీలో ఆమె కూర్చుంటుంది. 15 ప్రజలు ఆ ప్రక్కగా నడిచినప్పుడు ఆమె వారిని పిలుస్తుంది. ఆ మనుష్యులకు ఆమెయందు ఆసక్తి లేదు. కాని 16 “నేర్చుకోవాల్సిన ప్రజలారా, రండి” అని ఆమె అంటుంది. బుద్ధిహీనులను కూడ ఆమె ఆహ్వానించింది. 17 “మీరు నీళ్లు దొంగిలిస్తే అవి మీ స్వంత నీళ్లకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. మీరు రొట్టెను దొంగిలిస్తే మీరు స్వయంగా తయారు చేసుకొనే రొట్టెకంటె అది ఎక్కువ రుచిగా ఉంటుంది” అని ఆమె చెబుతుంది. 18 ఆమె ఇల్లు దయ్యాలతో మాత్రమే నిండి వుందని ఆ బుద్ధిహీనులకు తెలియదు. మరణస్థానపు లోతుల్లోకి వారిని ఆహ్వానించింది! |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International