Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

సామెతలు 28 - పవిత్ర బైబిల్

1 దుర్మార్గులకు ప్రతిదానిగూర్చీ భయమే. అయితే మంచి మనిషి సింహం అంత ధైర్యంగా ఉంటాడు.

2 ఒక దేశంలో పాపాలు చాలా ఉంటే, ఆ దేశాన్ని అనేక మంది నాయకులు పాలించటానికి ప్రయత్నిస్తారు. అయితే బలమైన రాజ్యానికి చాలాకాలం దాన్ని పాలించగల మంచి జ్ఞానముగల ఒకే నాయకుడు ఉంటాడు.

3 ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే, అతడు పంటలను పాడు చేసే భారీ వర్షంలా ఉంటాడు.

4 న్యాయచట్టానికి లోబడేందుకు నీవు తిరస్కరిస్తే, నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కాని నీవు న్యాయచట్టానికి లోబడితే, నీవు వారికి విరోధంగా ఉన్నట్టే.

5 దుర్మార్గులు న్యాయాన్ని అర్థం చేసికోరు. యెహోవాను ప్రేమించే వారు దానిని అర్థం చేసుకొంటారు.

6 ధనికుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై నిజాయితీగా ఉండటం మేలు.

7 న్యాయచట్టానికి విధేయుడయ్యే మనిషి తెలివి గలవాడు. కాని పనికిమాలిన వాళ్లతో స్నేహం చేసే వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు.

8 పేద ప్రజలను మోసం చేసి మరి వారిపై ఎక్కువ వడ్డీ వేసి నీవు ధనికుడవైతే నీ ధనం పోగొట్టుకొంటావు. వారి యెడల దయగల మరో మనిషికి అది చెందుతుంది.

9 ఒక మనిషి దేవుని ఉపదేశాలు వినేందుకు తిరస్కరిస్తే, అప్పుడు దేవుడు అతని ప్రార్థనలు వినేందుకు తిరస్కరిస్తాడు.

10 ఒక చెడ్డ మనిషి ఒక మంచి మనిషికి హాని చేసేందుకు పథకాలు వేయవచ్చు. కాని ఆ చెడ్డ మనిషి తన గోతిలో తానే పడిపోతాడు. మరియు మంచి మనిషికి మంచి సంగతులే సంభవిస్తాయి.

11 ధనికులు జ్ఞానముగల వారమని ఎల్లప్పుడూ తలస్తారు. అయితే జ్ఞానముగల పేదవాడు సత్యమును చూడగలడు.

12 మంచి మనుష్యులు నాయకులైనప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అయితే ఒక దుర్మార్గుడు ఎన్నుకోబడినప్పుడు ప్రజలంతా వెళ్లిపోయి దాక్కుంటారు.

13 తన పాపాలు దాచిపెట్టడానికి ప్రయత్నించే మనిషి ఎన్నటికీ విజయం పొందడు. కాని ఒక మనిషి తాను తప్పులు చేశానని ఒప్పుకొని మరియు తన పాపాలు విడిచినట్లయితే దేవుడు మరియు ప్రతి ఒక్కరూ అతని యెడల దయ చూపిస్తారు.

14 ఒక మనిషి గనుక ఎల్లప్పుడూ యెహోవాను గౌరవిస్తే ఆ మనిషి ఆశీర్వదించబడతాడు. కాని ఒక మనిషి మొండిగా ఉండి, యెహోవాను గౌరవించేదుకు తిరస్కరిస్తే అతనికి కష్టం వస్తుంది.

15 ఒక దుర్మార్గుడు బలహీనుల మీద పరిపాలన చేస్తే అతడు కోపంగా ఉన్న ఒక సింహంలా గాని, పోట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఒక ఎలుగుబంటిలా గాని ఉంటాడు.

16 ఒక అధికారి జ్ఞానము లేనివాడైతే అతడు తన క్రిందనున్న ప్రజలను బాధిస్తాడు. కాని నిజాయితీ గలిగి, మోసాన్ని అసహ్యించుకొనే అధికారి చాలాకాలం పరిపాలిస్తాడు.

17 ఒక మనిషి మరో మనిషిని చంపి నేరస్తుడైతే ఆ మనిషికి ఎన్నటికీ శాంతి ఉండదు. ఆ మనిషిని బలపరచవద్దు.

18 ఒక మనిషి సరిగ్గా జీవిస్తూ ఉంటే అప్పుడు అతడు క్షేమంగా ఉంటాడు. కాని ఒక మనిషి దుర్మార్గుడైతే అతడు తన అధికారాన్ని పోగొట్టుకుంటాడు.

19 కష్టపడి పనిచేసే వాడికి తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. కాని కలలు కంటూ తన సమయాన్ని వ్యర్థం చేసే మనిషి ఎల్లప్పుడూ పేదవానిగా ఉంటాడు.

20 దేవుణ్ణి వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు.

21 ఒక న్యాయమూర్తి న్యాయంగా ఉండాలి. కేవలం ఒక వ్యక్తి తనకు తెలిసిన వాడైనంత మాత్రాన అతడు వానిని బలపరచ కూడదు. అయితే కొందరు న్యాయమూర్తులు కొద్దిపాటి డబ్బు చెల్లింపునకే వారి నిర్ణయాలు మార్చివేస్తారు.

22 ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.

23 ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడని అతనితో చెప్పటం ద్వారా నీవు సహాయం చేస్తే, తర్వాత అతడు నిన్ను గూర్చి సంతోషిస్తాడు. ఎల్లప్పుడూ పొగిడే మనుష్యుల కంటే అది చాలా మంచిది.

24 కొందరు మనుష్యులు వారి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేస్తారు. “అదేమీ తప్పుకాదు” అని వారు అంటారు. కాని ఒక వ్యక్తి ఇంటిలోపలకు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాటన్నిటినీ పగలకొట్టడం ఎంత చెడ్డదో, అదీ అంత చెడ్డదే.

25 ఒక స్వార్థపరుడు కష్టం కలిగిస్తాడు. కాని యెహోవాను సమ్ముకునేవాడు ప్రతిఫలం పొందుతాడు.

26 ఒక మనిషి తనను తానే నమ్ముకొంటే అతడు బుద్ధిహీనుడు. కాని ఒక మనిషి జ్ఞానముగలవాడైతే అతడు నాశనాన్ని తప్పించు కొంటాడు.

27 ఒక మనిషి పేద ప్రజలకు ఇచ్చినట్లయితే అప్పుడు అతనికి అవసరమైనవన్నీ ఉంటాయి. కాని ఒక వ్యక్తి పేద ప్రజలకు సహాయం చేసేందుకు నిరాకరిస్తే అప్పుడు అతనికి చాలా చిక్కు కలుగుతుంది.

28 ఒక దుర్మార్గుడు పాలించేందుకు ఎన్నుకోబడితే అప్పుడు ప్రజలంతా దాక్కుంటారు. కాని ఆ దుర్మార్గుడు ఓడించబడితే అప్పుడు మరలా మంచివారు పాలన చేస్తారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ