Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

యోబు 41 - పవిత్ర బైబిల్

1 “యోబూ, నీవు మొసలిని గాలముతో పట్టుకొనగలవా? దాని నాలుకను తాడుతో కట్టివేయగలవా?

2 యోబూ, మొసలి ముక్కులోనుంచి తాడును నీవు వేయగలవా? లేక దాని దవడకు గాలపు ముల్లు ఎక్కించగలవా?

3 యోబూ, తన్ను స్వేచ్చగా పోనిమ్మని మొసలి నిన్ను బ్రతిమలాడుతుందా? అది మర్యాద మాటలతో నీతో మాట్లాడుతుందా?

4 యోబూ, మొసలి నీతో ఒడంబడిక చేసుకుంటుందా? శాశ్వతంగా నిన్ను సేవిస్తానని వాగ్దానం చేస్తుందా?

5 యోబూ, నీవు ఒక పిట్టతో ఆడుకొనగలవా? మొసలితో ఆడుకొనగలవా? నీ దాసీలు దానితో ఆడుకొనేందుకు దానికి ఒక తాడు కట్టగలవా?

6 యోబూ, జాలరులు నీవద్ద మొసలిని కొనుటకు ప్రయత్నిస్తారా? వారు దానిని వ్యాపారులకు అమ్మేందుకు దానిని ముక్కలుగా కోయగలరా?

7 యోబూ, మొసలి చర్మం మీదికి, దాని తలమీదికి శూలాలు నీవు విసరగలవా? లేక చేపలను వేటాడే అలుగులు అనేకం కొట్టగలవా?

8 “యోబూ, ఒక వేళ నీవు నీ చేతిని మొసలి మీద ఉంచితే దానితో నీ గట్టి పోరాటాన్ని నీవు ఎప్పటికీ మరచిపోలేవు. మరియు నీవు దానితో మరల ఎన్నటికీ పోరాడవు.

9 ఒక వేళ నీవు మొసలిని ఓడించగలనని అనుకుంటే అది మరచిపో! అలాంటి ఆశ ఏమీ లేదు! దాన్ని చూస్తేనే నీకు భయం పుడుతుంది.

10 మొసలికి కోపం పుట్టించగలిగినంత ధైర్యంగల మనిషి ఎవరూ లేరు. “కనుక అలాంటప్పుడు యోబూ, నాకు విరోధంగా నిలువగలవాడు ఎవడు?

11 నేను (దేవుణ్ణి) ఎవరికీ ఏమీ బాకీ లేను. ఆకాశమంతటి క్రింద ఉన్న సర్వము నాదే.

12 “యోబూ, మొసలి కాళ్లను గూర్చి, దాని బలం, దాని అందమైన ఆకారం గూర్చి నేను నీతో చెబుతాను.

13 మొసలి చర్మాన్ని ఎవరూ ఊడదీయలేరు. ఒక కళ్లెం పట్టుకొని ఎవ్వరూ దాని సమీపంగా రాజాలరు.

14 మొసలి దవడలు తెరిపించడానికి ఎవరూ దానిని బలవంతం చేయలేరు. దాని దవడల్లోని పళ్లు మనుష్యులను భయపెడతాయి.

15 మొసలి వీపు మీది గట్టి పొలుసుల వరుసలు దగ్గర దగ్గరగా కుదించబడ్డాయి.

16 గాలి జొరబడలేనంత దగ్గర దగ్గరగా ఆ పొలుసులు ఉంటాయి.

17 ఆ పొలుసులు ఒక దానితో ఒకటి జత చేయబడ్డాయి. వాటిని ఊడబెరుకుటకు వీలులేనంత గట్టిగా ఒకదానినొకటి అంటిపెట్టుకొని ఉంటాయి.

18 మొసలి తుమ్మినప్పుడు అది వెలుగు ప్రకాశించినట్టుగా ఉంటుంది. దాని కళ్లు ఉదయపు వెలుగులా ఉంటాయి.

19 దాని నోటి నుండి మండుతున్న జ్వాలలు బయటకు వస్తాయి. నిప్పు కణాలు బయటకు లేస్తాయి.

20 ఉడుకుతూ ఉన్న కుండ కింద కాలుతున్న పిచ్చి మొక్కలనుండి పొగవచ్చినట్టుగా మొసలి ముక్కునుండి పొగ వస్తుంది.

21 మొసలి శ్వాస బొగ్గులను మండిస్తుంది. దాని నోటినుండి అగ్ని జ్వాలలు వస్తాయి.

22 మొసలి మెడ చాలా బలంగా ఉంటుంది. మనుష్యులు దానిని చూచి భయపడి దాని నుండి పారిపోతారు.

23 మొసలి శరీరంలో బలహీనత ఏమీ లేదు. అది ఇనుములా గట్టిగా ఉంటుంది.

24 మొసలి గుండె బండలా ఉంటుంది. దానికి భయం ఏమీ లేదు. అది తిరుగలి క్రింది రాయిలా గట్టిగా ఉంటుంది.

25 మొసలి మేల్కొన్నప్పుడు బలమైన మనుష్యులు భయపడతారు. మొసలి తోక ఆడించినప్పుడు వారు పారిపోతారు.

26 ఖడ్గం, బల్లెం, బాణం మొసలిని కొడితే అవి తిరిగి వస్తాయి. ఆ ఆయుధాలు దానికే మాత్రం హాని చేయవు.

27 మొసలికి ఇనుమును గడ్డి పరకలా విరుగ గొట్టడం తేలిక. ఇత్తడిని పుచ్చిపోయిన చెక్కలా విరుగ గొట్టటం తేలిక.

28 బాణాలు మొసలిని పారిపోయేటట్టు చేయలేవు. దానిమీద విసిరిన బండలు ఎండి గడ్డిపోచల్లా ఉంటాయి.

29 దుడ్డు కర్రతో మొసలిని కొట్టినప్పుడు అది దానికి ఒక గడ్డి పరకలా అనిపిస్తుంది. మనుష్యులు దాని మీద ఈటెలు విసిరినప్పుడు అది నవ్వుతుంది.

30 మొసలి శరీరం క్రింద ఉన్న చర్మం పగిలి పోయిన చాలా వాడి చిల్లపెంకుల్లా ఉంటుంది. అది నడిచినప్పుడు మట్టిలో నురిపిడి కొయ్యలా గుంటలు చేస్తుంది.

31 కాగుతున్న కుండలోని నీళ్లను అది బుడగలు పొంగిస్తుంది. నూనె మసులుతున్న కుండలా అది నీటిని పొంగిస్తుంది.

32 మొసలి ఈదినప్పుడు దాని వెనుక ఒక దారి ఏర్పడుతుంది. అది నీళ్లను పొంగింప జేసినప్పుడు దాని వెనుక తెల్లని నురుగు ఉంటుంది.

33 భూమి మీద ఏ జంతువూ మొసలిలాంటిది లేదు. అది భయం లేని జంతువుగా చేయబడింది.

34 మహా గర్విష్ఠి జంతువులను మొసలి చిన్న చూపు చూస్తుంది. క్రూర జంతువులన్నిటికీ అది రాజు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ