యోబు 32 - పవిత్ర బైబిల్ఎలీహు తన వాదాన్ని పెంచటం 1 అప్పుడు యోబు స్నేహితులు ముగ్గురూ యోబుకు జవాబు ఇచ్చే ప్రయత్నం విరమించుకొన్నారు. యోబు తన మట్టుకు తాను నిర్దోషినని అనుకోవడం చేత వారు విరమించుకొన్నారు. 2 ఎలీహు అనే పేరు గల ఒకతను అక్కడ ఉన్నాడు. ఎలీహు బరకెయేలు కుమారుడు. బరకెయేలు బూజు సంతతి వాడు. ఎలీహు రాము వంశస్థుడు. ఎలీహు యోబు మీద చాలా కోపగించాడు. ఎందుకంటే యోబు తన మట్టుకు తానే మంచివాడినని చెప్పుకొంటున్నాడు. మరియు యోబు తాను దేవునికంటే నీతిమంతుణ్ణి అని చెబుతున్నాడు. 3 కాబట్టి ఎలీహు యోబు స్నేహితుల మీద కూడా కోపగించాడు. ఎందుకంటే యోబు స్నేహితులు ముగ్గురూ యోబు ప్రశ్నలకు జవాబులు ఇవ్వలేక యోబుదే తప్పు అని రుజువు చేయలేకపోయారు. 4 అక్కడ ఉన్న వారిలో ఎలీహు చాలా చిన్నవాడు. కనుక ప్రతి ఒక్కరూ మాట్లాడటం అయ్యేంత వరకు అతడు వేచి ఉన్నాడు. అప్పుడు అతడు మాట్లాడటం ప్రారంభించవచ్చు అని అనుకొన్నాడు. 5 యోబు స్నేహితులు ముగ్గురూ చెప్పాల్సింది ఇంక ఏమీలేదని ఎలీహు చూచినప్పుడు అతనికి కోపం వచ్చింది. 6 కనుక ఎలీహు మాట్లాడటం ప్రారంభించాడు. అతడు ఇలా అన్నాడు: “నేను చిన్నవాడిని. మీరు పెద్దవాళ్లు. అందుకే నేను అనుకొంటున్నది ఏమిటో మీతో చెప్పాడానికి భయపడుతున్నాను. 7 ‘పెద్దవాళ్లు ముందుగా మాట్లాడాలి. చాలా సంవత్సరాలు బ్రతికిన మనుష్యులు తమ జ్ఞానాన్ని పంచి ఇవ్వాలి’ అని నాలో నేను అనుకొన్నాను. 8 కాని ఒక వ్యక్తిలో దేవుని ఆత్మ, సర్వశక్తిమంతుడైన దేవుని ‘ఊపిరి’ ఆ వ్యక్తికి జ్ఞానం ప్రసాదిస్తుంది. 9 వృద్ధులు మాత్రమే జ్ఞానం గల మనుష్యులు కారు. వయస్సు పైబడిన వాళ్లు మాత్రమే సరియైన అవగాహన గలవారు కారు. 10 “అందువల్లనే ఎలీహు అనే నేను నా మాట వినమని చెబుతున్నాను. నేను తలచేదేమిటో కూడా నేను మీతో చెబుతాను. 11 మీరు మాట్లాడుతూ ఉన్నంతసేపూ నేను సహనంతో వేచి ఉన్నాను. మీరు యోబుకు చెప్పిన జవాబులు నేను విన్నాను. 12 మీరు తెలివిగల మాటలతో యోబుకు జవాబు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నంతసేపూ నేను శ్రద్ధగా విన్నాను. కాని యోబుదే తప్పు అని మీరు ముగ్గురూ రుజువు చేయలేదు. యోబు వాదాలకు మీలో ఒక్కరూ జవాబు చెప్పలేదు. 13 మీరు ముగ్గురూ జ్ఞానం కనుగొన్నట్టు చెప్పలేరు. యోబు వాదాలకు దేవుడే జవాబు చెప్పాలి కాని మనుష్యులు కాదు. 14 కాని యోబు నాతో వాదించలేదు. అందుచేత మీరు ముగ్గురూ ప్రయోగించిన వాదాలను నేను ఉపయోగించను. 15 “యోబూ, నీ ముగ్గురు స్నేహితులూ ఇబ్బంది పడిపోతున్నారు. వారు చెప్పాల్సింది ఇంక ఏమీ లేదు. వారి వద్ద జవాబులు ఇంకేమీ లేవు. 16 ఈ ముగ్గురు మనుష్యులూ మౌనంగా ఉన్నారు, అక్కడే నిలబడ్డారు, జవాబు ఏమీ లేదు. కనుక నేను ఇంకా వేచి ఉండాలా? 17 లేదు! నేను కూడా నా జవాబు చెబుతాను. నేను తలుస్తున్నది కూడ నీతో చెబుతాను. 18 ఎందుకంటే, నేను చెప్పాల్సింది చాలా ఉంది. నాలో ఉన్న ఆత్మ నన్ను మాట్లాడమని బలవంతం చేస్తోంది. 19 కొద్ది సేపట్లో పొర్లిపోయే ద్రాక్షారసంలా నా అంతరంగంలో నేను ఉన్నాను. త్వరలో పగిలిపోబోతున్న కొత్త ద్రాక్షా తిత్తిలా నేను ఉన్నాను. 20 కనుక నేను మాట్లాడాలి. అప్పుడు నాకు బాగుంటుంది. నేను నా పెదాలు తెరచి యోబు ఆరోపణలకు జవాబు చెప్పాలి. 21 ఈ వాదంలో నేను ఎవరి పక్షమూ వహించను. నేను ఎవరినీ పొగడను. నేనేమి చెప్పాలో దానిని చెబుతాను. 22 ఒక మనిషిని ఎలా పొగడాలో నాకు తెలియదు. ఒకరిని ఎలా పొగడాలో నాకు తెలిసి ఉంటే వెంటనే దేవుడు నన్ను శిక్షిస్తాడు. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International