యోబు 26 - పవిత్ర బైబిల్బిల్దదుకు యోబు జవాబు 1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: 2 “బిల్దదూ, జోఫరూ, ఎలీఫజూ మీరు బలహీనులైన మనుష్యులకు నిజంగా సహాయం చేయగలరు. అవును, మీరు నన్ను ప్రోత్సహించారు. బలహీనమైన నా చేతులను మీరు తిరిగి బలం గలవిగా చేసారు. 3 అవును, జ్ఞానంలేని మనిషికి మీరు అద్భుతమైన సలహా ఇచ్చారు. మీరు చాలా జ్ఞానం ప్రదర్శించారు. 4 ఈ సంగతులు చెప్పటానికి మీకు ఎవరు సహాయం చేశారు. ఎవరి ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించింది? 5 “మరణించిన వారి ఆత్మలు భూమి కింద నీళ్లలో విలవిల్లాడుతున్నాయి. 6 మరణ స్థలం దేవుని దృష్టికి బాహాటం. దేవునికి మరణం మరుగు కాదు. 7 ఉత్తర ఆకాశాన్ని శూన్య అంతరిక్షంలో దేవుడు విస్తరింపజేశాడు. దేవుడు భూమిని శూన్యంలో వేలాడతీశాడు. 8 మేఘాలను దేవుడు నీళ్లతో నింపుతున్నాడు. కానీ నీటి భారం మూలంగా మేఘాలు బద్దలు కాకుండా దేవుడు చూస్తాడు. 9 పున్నమి చంద్రుని దేవుడు కప్పివేస్తాడు. దేవుడు తన మేఘాలను చంద్రుని మీద విస్తరింపచేసి, దానిని కప్పుతాడు 10 మహా సముద్రం మీది ఆకాశపు అంచులను చీకటి వెలుగులకు మధ్య సరిహద్దుగా దేవుడు చేస్తాడు. 11 ఆకాశాలను ఎత్తిపట్టు పునాదులను దేవుడు బెదిరించగా అవి భయంతో వణకుతాయి. 12 దేవుని శక్తి సముద్రాన్ని నిశ్శబ్దం చేస్తుంది. దేవుని జ్ఞానము రాహాబు సహాయకులను నాశనం చేసింది. 13 దేవుని శ్వాస ఆకాశాలను తేటపరుస్తుంది. తప్పించుకోవాలని ప్రయత్నించిన సర్పాన్ని దేవుని హస్తం నాశనం చేస్తుంది. 14 దేవుని శక్తిగల కార్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. దేవుని నుండి ఒక చిన్న స్వరం మాత్రమే మనం వింటాం. కానీ దేవుడు ఎంత గొప్పవాడో, శక్తిగలవాడో ఏ మనిషి నిజంగా అర్థం చేసుకోలేడు.” |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International