యోబు 23 - పవిత్ర బైబిల్యోబు జవాబు 1 అప్పుడు యోబు ఇలా జవాబు ఇచ్చాడు: 2 “ఈవేళ నేను ఇంకా కోపంగా ఆరోపిస్తూనే ఉన్నాను. దేవుడు నన్ను కఠినంగా శిక్షిస్తున్నాడు, కనుక నేను ఆరోపిస్తూనే ఉంటాను. 3 దేవునిని ఎక్కడ వెదకాలో ఆయన యొద్దకు ఎలా వెళ్లాలో నాకు తెలిస్తే బాగుండేది, అని నా ఆశ. 4 నేను దేవునికి నా గాధ వివరించుకొంటాను. నేను నిర్దోషిని అని చూపించటంకోసం నా నోరు వాదాలతో నిండిపోతుంది. 5 నా వాదాలకు దేవుడు ఎలా జవాబు ఇస్తాడో నేను తెలిసికోవాలని కోరుతున్నాను. అప్పుడు నేను దేవుని జవాబులు గ్రహిస్తాను. 6 దేవుడు గొప్ప శక్తితో నాకు విరోధంగా ఉంటాడా? లేదు, ఆయన నా మాట వింటాడు! 7 అక్కడ, దేవుని యెదుట ఒక మంచి మనిషి తన గాధను దేవునికి వివరించవచ్చును. అప్పుడు నా న్యాయమూర్తి నన్ను విముక్తుణ్ణి చేయవచ్చును. 8 “కానీ నేను తూర్పుకు వెళ్తే దేవుడు అక్కడ లేడు. ఒకవేళ నేను పడమటికి వెళ్తే ఇంకా దేవుడు నాకు కనబడలేదు. 9 దేవుడు ఉత్తరాన పని చేస్తున్నప్పుడు నాకు ఆయన కనబడడు. దేవుడు దక్షిణంగా తిరిగినప్పుడు ఇంకా ఆయన నాకు కనబడడు. 10 కానీ నేను వేసే ప్రతి అడుగూ దేవునికి తెలుసు. ఆయన నన్ను పరీక్షించటం ముగించినప్పుడు నాలో మైల ఏమీ లేనట్టుగా ఆయన చూస్తాడు. నేను స్వచ్ఛమైన బంగారంలా ఉన్నట్టు ఆయన చూస్తాడు. 11 నేను ఎల్లప్పుడూ దేవుడు కోరిన మార్గంలోనే నడిచాను. దేవుని మార్గం అనుసరించకుండా నేను ఎన్నడూ తిరిగిపోలేదు. 12 దేవుడు ఆజ్ఞాపించే వాటినే నేను ఎల్లప్పుడూ చేస్తాను. నా భోజనం కంటే దేవుని నోటినుండి వచ్చే మాటలు నాకు ఇష్టం. 13 “కానీ దేవుడు ఎన్నటికీ మారడు. ఏ మనిషి ఆయనకు విరోధంగా నిలబడలేడు. దేవుడు అనుకొన్నది ఆయన చేస్తాడు. 14 దేవుడు నాకు వ్యతిరేకంగా ఏమి పథకం వేశాడో దాన్ని ఆయన చేస్తాడు. నా కోసం ఆయనకు ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. 15 అందుకే నేను దేవుని ఎదుట జీవిస్తూ ఉండగా నేను భయపడతాను. వీటన్నింటిని గూర్చీ నేను తలచినప్పుడు దేవునికి నేను భయపడతాను. 16 దేవుడు నా హృదయాన్ని బలహీనం చేస్తాడు. నేనేమో నా ధైర్యం కోల్పోతాను. సర్వశక్తిమంతుడైన దేవుడు నన్ను భయపెడతాడు. 17 కానీ చీకటి నన్ను మౌనంగా ఉండేటట్టు చేయదు. గాఢాంధకారం నా ముఖాన్ని కప్పేస్తుంది. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International