యోబు 21 - పవిత్ర బైబిల్యోబు జవాబు 1 అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు: 2 “నేను చెప్పేది వినండి. మీరు వినటమే మీరు నాకు ఇచ్చే ఆదరణ. 3 నేను మాట్లాడేటప్పుడు ఓపిగ్గా ఉండండి. ఆ తర్వాత నేను మాట్లాడటం ముగించాక మీరు నన్ను గేళి చేయవచ్చు. 4 “నేను మనుష్యుల మీద ఆరోపణ చేయటం లేదు. నేను ఓపికగా ఉండకపోవటానికి ఒక మంచి కారణం ఉంది. 5 నన్ను చూచి, అదరిపొండి. మీ నోటిమీద చేయి పెట్టుకొని అదురుతో నన్ను అలానే తేరి చూడండి. 6 నాకు సంభవించిన దానిని గూర్చి తలచినప్పుడు నేను భయపడతాను, నా శరీరం వణకుతుంది. 7 దుర్మార్గులు చాలాకాలం బ్రతుకుతారెందుకు? వారు ముసలివాళ్లవ్వటం, విజయం పొందటం ఎందుకు? 8 దుర్మార్గులు వారితోబాటు వారి పిల్లలు ఎదగటం చూస్తారు. దుర్మార్గులు వారి మనుమలు, మనుమరాండ్రను చూసేంత వరకు బ్రతుకుతారు. 9 వారి ఇండ్లు భద్రంగా ఉన్నాయి. వారికి భయం లేదు. దుర్మార్గులను శిక్షించడానికి దేవుడు తన దండం ఉపయోగించడు. 10 వారి ఆబోతులు ఆవులను దాటటం తప్పవు. వారి ఆవులకు దూడలు పుడతాయి. ఆ దూడలు పుట్టినప్పుడు అవి ఎన్నడూ చావవు. 11 దుర్మార్గులు వారి పిల్లలు ఆడుకొనేందుకు గొర్రె పిల్లల్లా బయటకు పంపిస్తారు. వారి పిల్లలు గంతులు వేస్తారు. 12 స్వరమండలాలు, పిల్లనగ్రోవుల ధ్వనులతోబాటు వారి పిల్లలు పాడుతూ, నాట్యం చేస్తారు. 13 దుర్మార్గులు వారి జీవితకాలంలో విజయం అనుభవిస్తారు. అనగా వారు మరణించి, శ్రమ అనుభవించకుండానే తమ సమాధికి వెళ్తారు. 14 కానీ దుర్మార్గులు, దేవునితో ఇలా చెబుతారు, ‘మమ్మల్ని ఇలా విడిచిపెట్టండి, మేము ఏమి చేయాలని మీరు కోరుతారో అది మాకు లెక్కలేదు’ అంటారు. 15 మరియు దుర్మార్గులు, ‘సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు? మేము ఆయనను సేవించాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రార్థన చేసిన లాభం లేదు’ అంటారు. 16 “దుర్మార్గులు తమ మూలంగానే వారికి విజయం కలుగుతుందని తలస్తారు. కానీ నేను వారి తలంపును అంగీకరించను. 17 అయితే దుర్మార్గుల దీపం ఆర్పివేయబడటం అనేది, ఎంత తరచుగా జరుగుతుంది? దుర్మార్గులకు ఎన్నిసార్లు కష్టం వస్తుంది? దేవుడు వారి మీద కోపగించి వారిని శిక్షిస్తాడా? 18 గాలి గడ్డిని ఎగురగొట్టినట్టు, బలమైన గాలి ఊకను ఎగురగొట్టినట్లు దేవుడు దుర్మార్గులను ఎగురగొట్టి వేస్తాడా? 19 ‘తండ్రి పాపాల మూలంగా దేవుడు అతని కుమారుణ్ణి శిక్షిస్తాడు’ అని మీరంటారు. కాదు! ఆ దుర్మార్గుడినే దేవుడు శిక్షించనివ్వండి. అప్పుడు ఆ దుర్మార్గుడు తన స్వంత పాపాల కోసమే శిక్షించబడుతున్నట్టు అతనికి తెలుస్తుంది. 20 పాపి తన స్వంత శిక్షను చూడాలి. సర్వశక్తిమంతుడైన దేవుని కోపాన్ని అతడు అనుభవిస్తాడు. 21 దుర్మార్గుని జీవిత కాలం అయిపోయి, అతడు చనిపోయినప్పుడు అతడు విడిచిపెడుతున్న తన కుటుంబం విషయమై అతడు లెక్కచేయడు. 22 “దేవునికి ఎవరూ జ్ఞానం ఉపదేశించలేరు. ఉన్నత స్థానాల్లో ఉండే మనుష్యులకు కూడ దేవుడు తీర్పు తీరుస్తాడు. 23 ఒక వ్యక్తి నిండుగా, విజయవంతంగా జీవించాక మరణిస్తాడు. అతడు పూర్తిగా క్షేమం, సుఖం ఉన్న జీవితం జీవించాడు. 24 అతని శరీరం బాగా పోషించబడింది, అతని ఎముకలు మూలుగతో యింకా బలంగా ఉన్నాయి 25 అయితే మరో మనిషి కష్టతరంగా జీవించి, వేదనగల ఆత్మతో మరణిస్తాడు. అతడు మంచిది ఎన్నడూ, ఏదీ అనుభవించలేదు. 26 వీళ్లద్దరూ ఒకే చోట దుమ్ములో పండుకొని ఉంటారు. వాళ్లిద్దర్నీ పురుగులు పట్టేస్తాయి. 27 “కానీ మీరు ఏమి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. మరియు మీరు నాకు అపకారం చేయాలని తలపెడుతున్నారని నాకు తెలుసు. 28 ‘యువరాజు ఇల్లు ఎక్కడ? దుర్మార్గుడు నివసించిన ఆ ఇల్లు ఏది?’ అని మీరు అంటారు. 29 “కానీ ప్రయాణం చేసే మనుష్యులను మీరు ఎన్నడూ అడగలేదు. వారి కథలను మీరు అంగీకరించనూ లేదు. 30 విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్టబడతారు. ఏ రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో ఆ రోజు వాళ్లు రక్షింపబడతారు. 31 దుర్మార్గుడు చేసిన దుర్మార్గాన్ని గూర్చి దుర్మార్గుని ముఖంమీదే అతణ్ణి విమర్శించే వ్యక్తి ఎవ్వడూ లేడు. అతడు చేసిన కీడుకు అతనిని ఎవ్వరూ శిక్షించరు. 32 దుర్మార్గుడు సమాధికి మోసికొని పోబడినప్పుడు ఒక కాపలావాడు అతని సమాధి దగ్గర నిలుస్తాడు. 33 ఆ దుర్మార్గునికి లోయలోని మట్టి తియ్యగా ఉంటుంది. వాని చావు ఊరేగింపులో వేలాది మంది ఉంటారు. 34 “అందుచేత మీ వట్టి మాటలతో మీరు నన్ను ఆదరించలేరు. మీ జవాబులు ఇంకా అబద్ధాలే!” |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International