యోబు 14 - పవిత్ర బైబిల్1 యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం. 2 మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, త్వరగా చస్తాడు. కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం. 3 దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము. 4 “మురికి దానిలో నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు. 5 నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు. నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు. 6 కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు. 7 “అయితే ఒక చెట్టుకు నీరీక్షణ ఉంది. దాన్ని నరికివేస్తే, అది మరల పెరుగుతుంది. అది కొత్త కొమ్మలు వేస్తూనే ఉంటుంది. 8 భూమిలో దాని వేర్లు పాతవైపోవచ్చును. దాని మొద్దు మట్టిలో చీకిపోవచ్చును. 9 కానీ నీళ్లు ఉంటే అది కొత్త చిగుళ్లు వేస్తుంది. మొక్కల్లా అది కొమ్మలు వేస్తుంది. 10 అయితే మనిషి మరణిస్తాడు. అతని శరీరం పాతి పెట్టబడుతుంది. మనిషి చనిపోయినప్పుడు, అతుడు వెళ్లిపోయాడు. 11 సముద్రంలో నీరు ఇంకిపోయినట్టు, ఒక నది నీరు ఎండిపోయినట్టు 12 సరిగ్గా అదే విధంగా ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతడు పండుకొని, మళ్లీ లేవలేడు. మరణించే మనుష్యులు, ఆకాశాలు ఉండకుండా పోయేంత వరకు మేల్కొనరు, నిద్రించటం మానుకోరు. 13 “నీవు నన్ను నా సమాధిలో దాచిపెడితే బాగుండునని నా (యోబు) ఆశ. నీ కోపం పోయేవరకు, నీవు నన్ను అక్కడ దాచిపెడితే బాగుండుననిపిస్తుంది నాకు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనేందుకు నీవు ఒక సమయాన్ని ఏర్పరచుకోవచ్చు 14 ఒక మనిషి మరణిస్తే, అతడు మరల బ్రతుకుతాడా? నేను వేచి ఉంటాను, నేను విడుదల అయ్యేంత వరకు కష్టపడి పోరాడుతాను. 15 దేవా, నీవు నన్ను పిలుస్తావు, నేను (యోబు) నీకు జవాబు ఇస్తాను. నన్ను నీవు చేశావు, నన్ను నీవు కోరుతావు 16 అప్పుడు నేను వేసే ప్రతి అడుగూ నీవు గమనిస్తావు. కానీ, నేను చేసిన పాపాలు నీవు జ్ఞాపకం చేసుకోవు. 17 నీవు నా పాపాలు ఒక సంచిలో కట్టివేసి, దూరంగా పారవేయి. 18 “సరిగ్గా ఒక పర్వతం కూలిపోయినట్టు ఒక బండదాని స్థలం నుండి తొలగించబడినట్టు 19 నీళ్లు రాళ్లను కడిగివేసి వాటిని అరగ దీసినట్టు, నీళ్లు నేలమీద మట్టిని కొట్టుకుపోవునట్లు, అదే విధంగా, దేవా నీవు ఒక మనిషి ఆశను నాశనం చేస్తావు. 20 నీవు మనిషిని ఒకసారి ఓడించి ముగిస్తే మనిషి పోయినట్టే. నీవు వాని ముఖాన్ని చావు ముఖంగా మార్చివేసి శాశ్వతంగా వానిని పంపించివేస్తావు. 21 వాని కుమారులు గౌరవించబడినా అది ఎన్నటికీ అతనికి తెలియదు. అతని కుమారుడు చెడు చేస్తే అతడు ఎన్నటికీ దానిని చూడడు. 22 మనిషి తన స్వంత శరీరంతో బాధ అనుభవిస్తాడు. అతడు తన కోసమే ఎక్కువగా దుఃఖిస్తాడు.” |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International