Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

ఆదికాండము 46 - పవిత్ర బైబిల్


ఇశ్రాయేలుకు దేవుని అభయం

1 కనుక ఇశ్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు బెయేర్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు అర్పించాడు.

2 ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు. “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు.

3 అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను.

4 నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.”


ఇశ్రాయేలు ఈజిప్టుకు వెళ్ళుట

5 అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేశాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేశారు.

6 తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు.

7 అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు.


యాకోబు (ఇశ్రాయేలు) కుటుంబం

8 ఇశ్రాయేలుతో కలిసి ఈజిప్టుకు వెళ్లిన అతని కుమారులు, కుటుంబము వాళ్ల పేర్లు: రూబేను యాకోబుయొక్క మొదటి కుమారుడు.

9 రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

10 షిమ్యోను కుమారులు; యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ కుమారుడు షావూలు.

11 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారీ.

12 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు,

13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, షిమ్రోను.

14 జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.

15 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ కుటుంబంలో 33 మంది ఉన్నారు.

16 గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోదీ, అరేలీ,

17 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, వారి సోదరి శెరహు. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.

18 వారంతా యాకోబుకు అతని భార్య లేయా సేవకురాలు జిల్ఫాద్వారా పుట్టిన కుమారులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు.

19 మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.)

20 ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: మనష్షే, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య).

21 బెన్యామీను కుమారులు: బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.

22 వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు.

23 దాను కుమారుడు: హుషీము

24 నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము.

25 వారు యాకోబు, బిల్హాలకు పుట్టిన కుమారులు (రాహేలు సేవకురాలు బిల్హా). ఈ కుటుంబంలో 7 మంది ఉన్నారు.

26 ఇలా యాకోబు సంతానం ఈజిప్టుకు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు).

27 మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు.


ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చుట

28 యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు.

29 యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు.

30 అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు, నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను” అని యోసేపుతో చెప్పాడు.

31 తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్లు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని చెబుతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు.

32 ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’

33 ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు.

34 అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను దేశంలో ఉండవచ్చు.”

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ