Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

ఆదికాండము 25 - పవిత్ర బైబిల్


అబ్రాహాము వేరే భార్యల కుటుంబాలు

1 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన క్రొత్త భార్య పేరు కెతూరా.

2 కెతూరాకు జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు.

3 యొక్షాను షేబకు, దెదానుకు తండ్రి. అష్షూరు, లెయుమీ మరియు లెతూషీ ప్రజలు దెదాను సంతానము.

4 మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రాహాము, కెతూరా వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు.

5-6 అబ్రాహాము చనిపోక ముందు తన దాసీల కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రాహాము తూర్పునకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేశాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు.

7 అబ్రాహాము 175 సంవత్సరాల వయస్సు వరకు జీవించాడు.

8 అప్పుడు అబ్రాహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవితం అతడు జీవించాడు. అతడు మరణించి తనవారి దగ్గరకు చేర్చబడ్డాడు.

9 అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలసి మక్పేలా గుహలో అతణ్ణి పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది.

10 హిత్తీ ప్రజల దగ్గర్నుండి అబ్రాహాము కొన్న గుహ ఇదే. అబ్రాహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు.

11 అబ్రాహాము చనిపోయిన తరువాత, ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయేర్ లహాయిరోయిలోనే నివాసం కొనసాగించాడు.

12 ఇష్మాయేలు వంశంవారి జాబితా ఇది. అబ్రాహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. (శారాకు ఈజిప్టు దాసి హాగరు.)

13 ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబ్శాము,

14 మిష్మా, దూమారమశ్శా,

15 హదరు, తేమా, యెతూరు, నాఫీషు, కెదెమా పుట్టారు.

16 అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో స్వంత శిబిరం ఉండేది, అదే ఒక చిన్న పట్టణం అయింది. పన్నెండు మంది కుమారులు, వారి స్వంత ప్రజలతో, పన్నెండు మంది యువరాజుల్లా ఉన్నారు.

17 ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతను చనిపోయి, అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు.

18 ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బసచేశారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అష్షూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు.


ఇస్సాకు కుటుంబం

19 ఇస్సాకు కుటుంబం చరిత్ర ఇది. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడు ఉన్నాడు.

20 ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రిబ్కాను అతడు వివాహం చేసుకొన్నాడు. రిబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె, అరామీయుడగు లాబానుకు సోదరి.

21 ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రిబ్కాను గర్భవతిని కానిచ్చాడు.

22 రిబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు, ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రిబ్కా యెహోవాను ప్రార్థించి, “ఎందుకు నాకు ఇలా జరిగింది?” అని అడిగింది.

23 ఆమెతో యెహోవా చెప్పాడు: “నీ గర్భంలో రెండు జనాంగాలు ఉన్నాయి. రెండు వంశాల పాలకులు నీలోనుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుని సేవిస్తాడు.”

24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది.

25 మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం బొచ్చు అంగీలా ఉంది. కనుక వానికి ఏశావు అని పేరు పెట్టబడింది.

26 రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏశావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు, ఏశావు పుట్టినప్పుడు ఇస్సాకు వయస్సు 60 సంవత్సరాలు.

27 అబ్బాయిలు పెద్దవాళ్లయ్యారు. ఏశావు నిపుణతగల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు.

28 ఇస్సాకు ఏశావును చాలా ప్రేమించాడు. ఏశావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. కాని రిబ్కాకు యాకోబు మీద ప్రేమ.

29 ఒకసారి ఏశావు వేటనుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి, ఆకలితో బలహీనంగా ఉన్నాడు. యాకోబు వంట పాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు.

30 కనుక ఏశావు, “నేను ఆకలితో నీరసం అయిపోయాను. ఆ ఎర్రటి చిక్కుడు కాయలు నాకు కొంచెం పెట్టు” అని యాకోబును అడిగాడు. (అందుకే ప్రజలు అతణ్ణి ఎదోం అని పిలిచేవాళ్లు.)

31 అయితే యాకోబు, “నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈ వేళ నాకు అమ్మివేయాలి” అన్నాడు.

32 ఏశావు “నేను ఆకలితో దాదాపు చచ్చాను. నేను చనిపోతే, నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు. కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.

33 కానీ యాకోబు, “దాన్ని నాకు ఇస్తానని ముందు ప్రమాణం చేయాలి” అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేశాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేశాడు.

34 అప్పుడు యాకోబు రొట్టె, భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని, త్రాగి వెళ్లిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కులను లక్ష్యపెట్ట లేదని వ్యక్తం చేశాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ