యెహెజ్కేలు 47 - పవిత్ర బైబిల్ఆలయంనుంచి పారే నీరు 1 ఆ మనుష్యుడు నన్ను మళ్లీ ఆలయ ద్వారంవద్దకు నడిపించాడు. ఆలయ తూర్పు గుమ్మం క్రిందనుంచి నీరు బయటకు రావటం చూశాను. (ఆలయ ముఖద్వారం తూర్పునకే ఉంది) బలిపీఠానికి దక్షిణంగా ఉన్న ఆలయ దక్షిణపు భాగం చివరి నుండి నీరు ప్రవహిస్తూ ఉంది. 2 ఆ మనుష్యుడు నన్ను ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొని వచ్చి ఆ తరువాత తూర్పున ఉన్న వెలుపలి ద్వారం బయట చుట్టూ తిప్పాడు. ఆలయ దక్షిణ భాగాంలో నీరు బయటికి వస్తూఉంది. 3 ఆ మనుష్యుడు ఒక కొలత బద్ద పట్టుకొని నూరు మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లను దాటమని అతడు నాకు చెప్పాడు. నీళ్లు చీలమండలవరకు వచ్చాయి. 4 అతడు మరో ఐదు వందల ఎనభై ఆరు గజాల రెండడుగుల దూరం కొలిచాడు. మళ్లీ ఆ ప్రదేశంలో నీళ్లలో నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మోకాళ్ల వరకు వచ్చింది. మరో వెయ్యి మూరలు కొలిచాడు. అక్కడ నీళ్లలోనుండి నడవమని అతడు నాకు చెప్పాడు. అక్కడ నీరు నా మొలలోతు వచ్చింది. 5 ఆ మనిషి మరో వెయ్యి మూరలు కొలిచాడు. కాని అక్కడ నీరు దాటలేనంత లోతుగా ఉంది. అది ఒక నది అయింది. నీరు ఈదటానికి అనువైన లోతున ఉంది. అది దాట శక్యముగానంత లోతైన నది అయ్యింది. 6 “నరపుత్రుడా, నీవు చూచిన విషయాలను శ్రద్ధగా పరిశీలించావా?” అని ఆ మనుష్యుడు నన్నడిగాడు. పిమ్మట నది ప్రక్కగా ఆ మనుష్యుడు నన్ను తిరిగి వెనుకకు తీసుకొని వచ్చాడు. 7 నేను నది ప్రక్కగా తిరిగి వస్తూ వుండగా నీటికి రెండు ప్రక్కలా రకరకాల చెట్లు చూశాను. 8 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఈ నీరు తూర్పుగా అరబా లోయలోకి ప్రవహిస్తూ ఉంది. ఈ నీరు మృత సముద్రంలోకి ప్రవహించటంతో, దానిలోని నీరు మంచినీరై శుభ్ర పడుతూ ఉంది. 9 ఈ నీటిలో చేపలు విస్తారంగా వుంటాయి. ఈ నది ప్రవహించే ప్రాంతంలో అన్ని రకాల జంతువులు నివసిస్తాయి. 10 ఏన్గెదీ పట్టణం నుండి ఏనెగ్లాయీము పట్టణం వరకు బెస్తవాళ్లు నది ఒడ్డున నిలబడి ఉండటం నీవు చూడగలవు. వారు తమ వలలు విసరి రకరకాల చేపలు పట్టటం నీవు చూడవచ్చు. మధ్యధరా సముద్రంలో ఎన్ని రకాల చేపలు వుంటాయో మృత సముద్రంలో అన్ని రకాల చేపలు ఉంటాయి. 11 కాని అక్కడి పర్రలు, మరియు కొద్దిగానున్న తడి ప్రదేశాలు మంచి భూమిగా మారవు. అవి ఉప్పు తయారు చేయటానికి వదిలివేయబడతాయి. 12 అన్ని రకాల పండ్ల జాతి మొక్కలు నదికి ఇరు ప్రక్కల పెరుగుతాయి. వాటి ఆకులు ఎన్నడూ ఎండవు. ఆ చెట్లు పండ్లు ఇవ్వకుండా ఎప్పుడూ ఉండవు. ప్రతినెలా అవి పండ్లు ఇస్తూనే ఉంటాయి. చెట్లకు కావలసిన నీరు ఆలయం నుండి వస్తూ ఉంటుంది గనుక ఇలా జరుగుతుంది. చెట్ల నుండి లభించే పండ్లు ఆహారం నిమిత్తమూ, ఆకులు ఔషధాలకూ వినియోగపడతాయి.” ఇశ్రాయేలు వంశీయుల మధ్య భూమి విభజన 13 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇశ్రాయేలులోని పన్నెండు వంశ తెగలకు దేశాన్ని పంచే సరిహద్దులు ఇవి: యోసేపుకు రెండు భాగాలు. 14 మీరు దేశాన్ని సమానంగా పంచుకోవాలి. ఈ దేశాన్ని ఇస్తానని మీ పూర్వీకులకు నేను ప్రమాణం చేశాను. కావున ఇది మీకు నేను ఇస్తున్నాను. 15 “దేశ సరిహద్దులు ఇవి: ఉత్తరాన మధ్యధరా సముద్రం నుండి మొదలై హెత్లోను మార్గం ద్వారా హమాతు మార్గం వద్ద మలుపు తిరిగి తరువాత జెదాదుకు 16 బేరోతాయునకు, హాజేరు హమాతుకు పొలి మేరన గల సిబ్రయీము మరియు హవ్రానుకు పొలి మేరనగల దమస్కు హత్తికోను వరకు. 17 అలా సముద్రం నుండి హసరేనాను వెళ్లి ఉత్తర పొలిమేరలోని దమస్కు మరియు హమాతు వరకూ వ్యాపించింది. ఇది ఉత్తర సరిహద్దు. 18 “తూర్పు సరిహద్దు హసరేనాను నుండి మొదలై హవ్రాను, దమస్కుల మధ్యగా యొర్దాను నది ప్రక్కగా గిలాదు, ఇశ్రాయేలు భూభాగాల మధ్యగా తూర్పు సముద్ర తీరం వెంబడి తామారు వరకు వ్యాపించింది. ఇది తూర్పు సరిహద్దు. 19 “దక్షిణ సరిహద్దు తామారు నుండి మెరీబా కాదేషు ఊటల వరకు ఉంది. అది అక్కడ నుండి ఈజిప్టు వాగు ప్రక్కగా మధ్యధరా సముద్రం వరకు వ్యాపించింది. ఇది దక్షిణ సరిహద్దు. 20 “పశ్చిమాన లేబో-హమాతు వరకు మధ్యధరా సముద్ర తీరమంతా సరిహద్దుగా ఉంటుంది. ఇది మీ పడమటి సరిహద్దు. 21 “మీరీ దేశాన్ని ఇశ్రాయేలు తెగలకు విభజించాలి. 22 దీనిని మీరు ఆస్తిలా మీ మధ్య, మీ మధ్య నివసించే పరదేశీయులకు, మీలో ఉంటూ పిల్లలు కన్న వారికి మధ్య పంచియివ్వాలి. ఈ పరదేశీయులు దేశపౌరులే. వారు సహజంగా ఇక్కడ పుట్టి పెరిగిన ఇశ్రాయేలీయుల మాదిరే ఉంటారు. ఇశ్రాయేలు తెగలకు చెందిన భూమినుండి మీరు వారకి కొంత భూమిని విభజిస్తారు. 23 ఆ పౌరుడు ఏ తెగలో నివసిస్తూవుంటాడో అది అతనికి కొంత భూమిని ఇవ్వాలి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు! |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International