Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

నిర్గమ 37 - పవిత్ర బైబిల్


ఒడంబడిక పెట్టె (మందసము)

1 తుమ్మ కర్రతో పవిత్ర పెట్టెను బెసెలేలు చేసాడు. ఆ పెట్టె పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు. ఎత్తు 27 అంగుళాలు,

2 పెట్టె లోపల, బయట స్వచ్ఛమైన బంగారంతో అతడు తాపడం చేసాడు. తర్వాత పెట్టె చుట్టూ బంగారు నగిషీబద్ద కట్టాడు.

3 బంగారు ఉంగరాలు నాలుగు చేసి నాలుగు మూలలా వాటిని అమర్చాడు. పెట్టె మోయటానికి ఈ ఉంగరాలు ఉపయోగించబడ్డాయి. ఒక్కో ప్రక్క రెండేసి ఉంగరాలు ఉన్నాయి.

4 తర్వాత పెట్టెను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్రతో చేసి ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారం తాపడం చేసాడు.

5 పెట్టెకు ఒక్కో ప్రక్క ఉంగరాల గుండా కర్రలను దూర్చిపెట్టాడు.

6 తర్వాత స్వచ్ఛమైన బంగారంతో అతడు మూత చేసాడు. దాని పొడవు 45 అంగుళాలు, వెడల్పు 27 అంగుళాలు.

7 తర్వాత బెసలేలు కొట్టబడ్డ బంగారంతో రెండు కెరూబులను చేసాడు. ఆ కెరూబులను మూత కొనల మీద ఉంచాడు.

8 ఒక కొనమీద ఒక కెరూబును, మరో కొనమీద మరో కెరూబును ఉంచాడు. అంతా ఒకే భాగంలో ఉండేటట్టు ఆ కెరూబులు మూతతో కలిపి చేయబడ్డాయి.

9 కెరూబుల రెక్కలు ఆకాశంవైపు విప్పబడ్డాయి. ఆ కెరూబుల రెక్కలు పెట్టెను కప్పి ఉంచాయి. కెరూబులు ఎదురెదురుగా మూతను చూస్తూ ఉన్నాయి.


ప్రత్యేక బల్ల

10 తర్వాత అతడు తుమ్మ కర్రతో బల్లను చేసాడు. ఆ బల్ల పొడవు 36 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 27 అంగుళాలు.

11 అతడు ఆ బల్లను బంగారంతో తాపడం చేసాడు. బల్ల నాలుగు ప్రక్కల బంగారు నగిషీబద్ద చేసాడు.

12 అప్పుడు అతడు ఆ బల్ల చుట్టూ మూడు అంగుళాల చట్రం చేసాడు. ఆ చట్రం మీద బంగారు నగిషీబద్దను అతడు ఉంచాడు.

13 అప్పుడు అతడు ఆ బల్లకు నాలుగు బంగారు ఉంగరాలు చేసాడు. నాలుగు మూలలా నాలుగు బంగారు ఉంగరాలు అతడు అమర్చాడు. అక్కడే నాలుగు కాళ్లు ఉన్నాయి.

14 ఉంగరాలను బల్ల పైభాగంలో చట్రానికి దగ్గరగా అతడు పెట్టాడు. బల్లను మోసేందుకు ఉపయోగించే కర్రలను ఉంగరాలు పట్టి ఉంచుతాయి.

15 తర్వాత బల్లలను మోసేందుకు కర్రలను అతడు చేసాడు. తుమ్మ కర్ర ఉపయోగించి చేసిన, ఆ కర్రలకు స్వచ్ఛమైన బంగారు పూత పూసాడు.

16 అప్పుడు బల్ల మీద ఉపయోగించే వస్తువులన్నింటినీ తయారు చేసాడు. పానార్పణము పోసేందుకు పళ్లెములు, గరిటెలు, గిన్నెలు, పాత్రలు అతడు తయారు చేసాడు. ఇవన్నీ స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడ్డాయి.


దీప స్తంభం

17 తర్వాత అతడు దీపస్తంభం చేసాడు. స్వచ్ఛమైన బంగారం ఉపయోగించి, దాని దిమ్మను, స్తంభాన్ని తీర్చిదిద్దాడు. తర్వాత పువ్వుల్లా కనపడే గిన్నెలు చేసాడు. గిన్నెలకు మొగ్గలు, పువ్వులు ఉన్నాయి. అన్నీ స్వచ్ఛమైన బంగారంతోనే చేయబడ్డాయి. ఈ వస్తువులన్నీ ఒకే భాగంగా కలుపబడ్డాయి.

18 దీపస్తంభం ప్రక్కల్లో ఆరు కొమ్మలు ఉన్నాయి. ఒక పక్క మూడు కొమ్మలు, మరో పక్క మూడు కొమ్మలు ఉన్నాయి.

19 ఒక్కో కొమ్మకు మూడేసి బంగారు పూలున్నాయి. ఈ పూలు బాదం పూలవలె చేయబడ్డాయి. వాటికి మొగ్గలు, రేకులు ఉన్నాయి.

20 బంగారంతో చేయబడ్డ నాలుగు పూవులు దీపస్తంభంపు కాండానికి ఉన్నాయి. అవి కూడా మొగ్గలు, రేకులతో బాదం పూవుల్లానే ఉన్నాయి.

21 ఆరు కొమ్మలు రెండేసి చొప్పున మూడు భాగాలుగా ఉన్నాయి. ఒక్కో కొమ్మ విభాగం కింద ఒక్కో మొగ్గ ఉంది.

22 మొగ్గలు, కొమ్మలు, దీపస్తంభం అన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేయబడ్డాయి. ఈ బంగారం అంతా కొట్టబడి, ఒకే భాగంగా చేయబడింది.

23 ఈ దీపస్తంభానికి అతడు ఏడు దీపాలు చేసాడు. తర్వాత అతడు పళ్లెం, పట్టకారులు చేసాడు. సమస్తం స్వచ్ఛమైన బంగారంతో చేయబడింది.

24 దీపస్తంభం, దాని పరికరాలు అన్నీ తయారు చేయడానికి అతడు 75 పౌన్ల స్వచ్ఛమైన బంగారం ఉపయోగించాడు.


ధూప వేదిక

25 ధూపం వేసేందుకు అతడు ధూప వేదిక చేసాడు. తుమ్మ కర్రతో అతడు దీన్ని చేసాడు. వేదిక చతురస్రాకారం. దాని పొడవు 18 అంగుళాలు, వెడల్పు 18 అంగుళాలు, ఎత్తు 36 అంగుళాలు. వేదిక మీద నాలుగు కొమ్మలు ఉన్నాయి. ఒక్కొక్క మూలను ఒక్కొక్క కొమ్మ ఉంది. ఈ కొమ్మలు వేదికతో కలిపి ఒకే భాగంగా చేయబడ్డాయి.

26 పై భాగం, అన్ని ప్రక్కలు, కొమ్మలకీ అతడు బంగారు తాపడం చేసాడు. తర్వాత అతడు బలిపీఠం చుట్టూ బంగారు నగిషీబద్ద చేసాడు.

27 బలిపీఠానికి అతడు రెండు బంగారు ఉంగరాలు చేసాడు. బలపీఠం నగిషీబద్దకు అడుగు భాగాన ఒక్కో ప్రక్క ఒక్కోటిగా బంగారు ఉంగరాలను అమర్చాడు. వేదికను మోసే కర్రలను ఈ బంగారు ఉంగరాలు పట్టి వుంచేవి.

28 స్తంభాలను తుమ్మ కర్రతో చేసి, బంగారం తాపడం చేసాడు అతడు.

29 తర్వాత అభిషేకించే పవిత్ర తైలం చేసాడు. స్వచ్ఛమైన పరిమళ వాసనగల ధూపం కూడ అతడు చేసాడు. అత్తరు చేసే నైపుణ్యంగల ఒకని చేత ఇవన్నీ చేయబడ్డాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ