Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

నిర్గమ 27 - పవిత్ర బైబిల్


అర్పణలు దహించడానికి బలిపీఠం

1 “తుమ్మకర్రతో ఒక బలిపీఠం నిర్మించు. బలిపీఠం చతురస్రంగా ఉండాలి. అది 7 1/2 అంగుళాల పొడవు 7 1/2 అంగుళాల వెడల్పు 4 1/2 అంగుళాల ఎత్తు ఉండాలి.

2 బలిపీఠం నలుమూలలా ఒక్కోదానికి ఒక్కో కొమ్ము చేయాలి. అంతా ఒక్క వస్తువుగా ఉండేటట్టు ఒక్కో కొమ్మును దాని మూలకు జత చేయాలి. బలిపీఠాన్ని యిత్తడితో తాపడం చేయాలి.

3 “బలిపీఠం మీద ఉపయోగించబడే పరికరాలు, పాత్రలు అన్నింటినీ ఇత్తడితో చేయాలి. బిందెలు, పారలు, పాత్రలు, పళ్లపారలు, నిప్పునెత్తే పెంకులు ఇత్తడితో చేయాలి. బలిపీఠం నుండి బూడిద ఎత్తి శుభ్రం చేయడానికి యివి ఉపయోగించబడతాయి.

4 ఒక పెద్ద యిత్తడి జల్లెడలాంటి దానిని చేయాలి. తెర నాలుగు మూలలకు నాలుగు యిత్తడి ఉంగరాలు చెయ్యాలి.

5 బలిపీఠానికి అడుగున మెట్టు కింద తెరను పెట్టాలి. కింద నుండి బలిపీఠంలో సగం పై వరకు, తెర ఉంటుంది.

6 “బలిపీఠపు కర్రలు చేయడానికి తుమ్మకర్ర ఉపయోగించి వాటిని ఇత్తడితో తాపడం చేయాలి.

7 బలిపీఠం రెండు వైపులా ఉండే ఉంగరాల్లోనుంచి ఆ కర్రలను దూర్చాలి. బలిపీఠం మోయడానికి ఈ కర్రలను ఉపయోగించాలి.

8 బలిపీఠం గుల్లగా ఉంటుంది. దాని ప్రక్కలు పలకలతో చేయబడతాయి. నేను నీకు పర్వతం మీద చూపించినట్టే బలిపీఠాన్ని తయారు చెయ్యి.


గుడారానికి ఆవరణను ఏర్పరచటం

9 (“పవిత్ర గుడారం చుట్టూ తెరలతో కట్టు. ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరలు గోడగా ఉండాలి. సున్నితమైన బట్టతో ఈ తెరలు చేయబడాలి.

10 ఇరవై స్తంభాలు, ఆ స్తంభాల కింద 20 యిత్తడి దిమ్మలు ఉపయోగించాలి. స్తంభాల కొక్కేల తెరల కడ్డీలు వెండితో చేయాలి.

11 దక్షిణ వైపున ఉన్నంత పొడవే ఉత్తరం వైపున కూడా ఉండాలి. దానికి 100 తెరలు, 20 స్తంభాలు, 20 ఇత్తడి దిమ్మలు ఉండాలి. స్తంభాల కొక్కేలు తెరల కడ్డీలు వెండితోనే చేయబడాలి.

12 “ఆవరణం పడమటికొనవైపు 25 గజాల పొడవుగల తెరలతో ఒక గోడగా ఉండాలి. ఆ గోడ మీద 10 స్తంభాలు, 10 దిమ్మలు ఉండాలి.

13 ఆవరణ తూర్పు వైపు కూడా 25 గజాల పొడవు ఉండాలి.

14 (ఈ తూర్పు వైపే ఆవరణకు ప్రవేశం) ప్రవేశ ద్వారానికి అన్ని వైపులా ఏడున్నర గజాల పొడవు గల తెరలు ఉండాలి. ఆ పక్క మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.

15 అవతల వైపున కూడా ఏడున్నర గజాల పొడవుగల తెరలు ఉండాలి. ఆ పక్కన మూడు స్తంభాలు మూడు దిమ్మలు ఉండాలి.

16 “ఆవరణ ప్రవేశాన్ని కప్పడానికి 10 అంగుళాల పొడవుగల తెర చెయ్యాలి. సున్నితమైన బట్ట నీలం, ఎరుపు, ఊదారంగు బట్టలతో ఆ తెరను చేయాలి. ఆ తెరమీద చిత్ర పటాల అల్లిక ఉండాలి. నాలుగు స్తంభాలు, నాలుగు దిమ్మలు ఉండాలి.

17 ఆవరణ చుట్టూ ఉండే స్తంభాలన్నీ వెండి కడ్డీలతో జత కలపాలి. స్తంభాల కొక్కేలు వెండితోను, స్తంభాల దిమ్మలు యిత్తడితోను చేయాలి.

18 ఆవరణ 50 గజాల పొడవు 25 గజాల వెడల్పు ఉండాలి. ఆవరణ చుట్టు గోడ ఏడున్నర అడుగుల ఎత్తు ఉండాలి. తెరలు సున్నితమైన బట్టతో చేయాలి. స్తంభాలన్నింటి కింద ఉండే దిమ్మల్ని ఇత్తడితోనే చేయాలి.

19 అన్ని పరికరాలు, పవిత్ర గుడారం మేకులు పవిత్ర గుడారంలో ఉపయోగించే ఇతర వస్తువులు అన్నిటినీ ఇత్తడితోనే చేయాలి. మేకులు (ఆవరణ చుట్టూ తెరలకు) అన్నీ ఇత్తడితో చేయాలి.


దీపాలకు నూనె

20 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె తీసుకొని రమ్మని ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించు. ప్రతి సాయంకాలం వెలిగించాల్సిన దీపం కోసం ఈ నూనె ఉపయోగించు.

21 దీపం విషయం అహరోను, అతని కుమారులు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సన్నిధి గుడారంలో మొదటి గదిలోకి వారు వెళ్తారు. ఇది ఒడంబడిక పెట్టె ఉండే గది బయట (రెండు గదులను వేరు పరచే) తెర ముందర ఉంటుంది. ఇక్కడ సాయంత్రం నుండి తెల్లవారే వరకు యెహోవా ఎదుట దీపాలు తప్పక వెలుగుతూ ఉండేటట్టు వారు బాధ్యత వహిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు, వారి వారసులు శాశ్వతంగా ఈ ఆజ్ఞకు విధేయులు కావాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ