Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

నిర్గమ 24 - పవిత్ర బైబిల్


దేవుడు మరియు ఇశ్రాయేలీయులు ఒడంబడిక చేయటం

1 మోషేతో దేవుడు ఇలా చెప్పాడు: “నీవు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీయుల డెబ్బయి మంది పెద్దలు (నాయకులు) పర్వతం మీదకు వచ్చి అంత దూరంలోనుంచే నన్ను ఆరాధించాలి.

2 అప్పుడు మోషే తాను మాత్రం యెహోవాకు సమీపంగా రావాలి. మిగతా పురుషులు యెహోవాకు సమీపంగా రాకూడదు. మిగతా ప్రజలు పర్వతం మీదకి కూడా రాకూడదు.”

3 కనుక యెహోవా ఇచ్చిన నియమాలు, ఆజ్ఞలు అన్నింటిని గూర్చీ మోషే ప్రజలతో చెప్పాడు. అప్పుడు ప్రజలంతా, “యెహోవా చెప్పిన ఆజ్ఞలు అన్నింటికీ మేము విధేయులమవుతాము” అన్నారు.

4 కనుక యెహోవా ఆజ్ఞలు అన్నింటినీ మోషే రాసాడు. మర్నాటి ఉదయం పర్వతం దగ్గర మోషే ఒక బలిపీఠం నిర్మించాడు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒకటి చొప్పున పన్నెండు రాళ్లు నిలబెట్టాడు.

5 అప్పుడు బలులు అర్పించటానికి యువకులను మోషే పంపించాడు. దహన బలులుగా, సమాధాన బలులుగా ఎడ్లను ఈ మనుష్యులు అర్పించారు.

6 ఈ జంతువుల రక్తాన్ని మోషే భధ్రం చేసాడు. రక్తంలో సగాన్ని పాత్రల్లో ఉంచాడు మోషే. మిగతా సగం రక్తాన్ని బలిపీఠం మీద ఆయన పోసాడు.

7 ప్రత్యేక ఒడంబడిక వ్రాయబడ్డ పత్రాన్ని మోషే చదివాడు. ఆయన చదువుతోంది ప్రజలంతా వినగలిగేటట్టు మోషే ఆ ఒడంబడిక పత్రం చదివాడు. అప్పుడు ప్రజలు, “యెహోవా మాకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మేము విన్నాము. వాటికి విధేయులం అయ్యేందుకు మేము ఒప్పుకొంటున్నాము” అన్నారు.

8 తర్వాత బలి అర్పణ రక్తంతో నిండిన పాత్రలను మోషే పట్టుకొన్నాడు. ఆ రక్తాన్ని ప్రజలమీద మోషే చిలకరించాడు “మీతో యెహోవా ఒక ప్రత్యేక ఒడంబడిక చేసాడు అని ఈ రక్తం సూచిస్తుంది. మీకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలే ఈ ఒడంబడికను వివరిస్తాయి,” అని ఆయన చెప్పాడు.

9 అప్పుడు మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు పెద్దలు డెబ్బయి మంది పర్వతం మీదకు వెళ్లారు.

10 పర్వతం మీద ఈ మనుష్యులు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి చూసారు. ఆకాశం అంత నిర్మలంగా కనబడుతున్న నీలంలాటి దేనిమీదనో దేవుడు నిలబడ్డాడు.

11 ఇశ్రాయేలు నాయకులంతా దేవుణ్ణి చూచారు, కాని దేవుడు వాళ్లను నాశనం చేయలేదు. వాళ్లంతా కలిసి తిని త్రాగారు.


దేవుని ఆజ్ఞలు పొందడానికి మోషే వెళ్లటం

12 “పర్వతం మీద నా దగ్గరకు రా, నా ప్రబోధాలను, ఆజ్ఞలను పలకలుగా ఉన్న రెండు రాళ్ల మీద రాసాను. ఈ ప్రబోధాలు ప్రజలకోసం. ఆ రాతి పలకలను నేను నీకిస్తాను” అని యెహోవా మోషేతో చెప్పాడు.

13 కనుక మోషే, ఆయన సహాయకుడైన యెహోషువ కలసి దేవుని పర్వతం మీదకు వెళ్లారు.

14 మోషే, “మాకోసం ఇక్కడ వేచి ఉండండి. మేము తిరిగి మీ దగ్గరకు వస్తాము. నేను లేనప్పుడు అహరోను, హోరు మీ దగ్గరే ఉన్నారు. ఎవరికైనా సమస్య ఉంటే వాళ్ల దగ్గరకు వెళ్లండి,” అని ఆ పెద్దలతో (నాయకులతో) చెప్పాడు.


మోషే దేవున్ని కలుసుకోవడం

15 అప్పుడు మోషే పర్వతం మీదికి వెళ్లాడు. ఆ పర్వతాన్ని మేఘం కప్పేసింది.

16 సీనాయి పర్వతం మీద యెహోవా మహిమ దిగివచ్చింది. ఆరు రోజుల పాటు పర్వతాన్ని మేఘం కప్పేసింది. ఏడోరోజున ఆ మేఘంలోనుంచి యెహోవా మోషేతో మాట్లాడాడు.

17 ఇశ్రాయేలు ప్రజలు యెహోవా మహిమను చూడగలిగారు. అది ఆ పర్వతం మీద మండుతున్న అగ్నిలా వుంది.

18 అప్పుడు మోషే ఆ పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే ఆ పర్వతం మీదే ఉన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ