ద్వితీ 27 - పవిత్ర బైబిల్ప్రజలకోసం రాళ్ల జ్ఞాపికలు 1 మోషే. ఇశ్రాయేలు నాయకులతో కలసి, ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “నేడు నేను మీకు ఇచ్చే ఆజ్ఞలు అన్నింటికీ విధేయులుగా ఉండండి. 2 మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు ప్రవేశించిన రోజున, మీరు పెద్ద బండలను నిలబెట్టాలి. ఈ రాళ్లకు సున్నము పూయండి. 3 ఈ ధర్మశాస్త్రంలోని మాటలు అన్నీ ఆ బండలమీద వ్రాయండి. మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత ఇది మీరు చేయాలి. తర్వాత మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న – పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశంలోనికి మీరు వెళ్లాలి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా దీనిని మీకు వాగ్దానం చేసాడు. 4 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత, ఈ వేళ నేను మీకు ఆదేశించినట్టు ఏబాలు కొండ మీద మీరు ఈ బండలను నిలబెట్టాలి. ఈ బండలకు మీరు సున్నము పూయాలి. 5 మరియు అక్కడి రాళ్లు కొన్ని ఉపయోగించి మీ దేవుడైన యెహోవాకు మీరు ఒక బలిపీఠం కట్టాలి. రాళ్లను కోయటానికి యినుప పనిముట్లు ఉపయోగించవద్దు. 6 మీరు మీ దేవుడైన యెహోవాకు బలిపీఠం కట్టేటప్పుడు, పగులగొట్టని బండలనే మీరు ఉపయోగించాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవాకు ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించండి. 7 మరియు మీరు అక్కడ బలి అర్పణలు అర్పించి, సమాధాన బలులను అర్పించాలి. అక్కడ భోజనం చేసి, మీ దేవుడైన యెహోవాతో సంతోషంగా సమయం గడపండి. 8 మీరు నిలబెట్టే బండల మీద ఈ ధర్మశాస్త్రం అంతా చాలా తేటగా మీరు రాయాలి.” దేవుని నియమాలకు ప్రజల సమ్మతి 9 లేవీ యాజకులతో కలసి మోషే ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడి ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయులారా, నిశ్శబ్దంగా ఉండి, వినండి. ఈ వేళ మీరు మీ దేవుడైన యెహోవా ప్రజలు అయ్యారు. 10 కనుక మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది అంతా మీరు చేయాలి. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలు, చట్టాలకు మీరు విధేయులు కావాలి.” 11 అదే రోజున ప్రజలతో మోషే ఇంకా ఇలా చెప్పాడు: 12 “మీరు యొర్దాను నది దాటి వెళ్లిన తర్వాత గెరీజీము కొండమీద నిలబడి ప్రజలకు దీవెనలు ప్రకటించాల్సిన వంశాలు ఏవనగా: షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, యోసేపు, బెన్యామీను. 13 శాపం ప్రకటించటానికి రూబేను, గాదు, ఆషేరు, జెబూలూను, దాను నఫ్తాలి వంశాలు ఏబాలు కొండమీద నిలబడాలి. 14 “అప్పుడు లేవీయులు పెద్ద స్వరంతో ఇశ్రాయేలు ప్రజలందరితో ఇలా చెప్పాలి: 15 “‘విగ్రహాలను తయారు చేసుకొని, రహస్య స్థలంలో దాచిపెట్టుకొనేవాడు శాపగ్రస్థుడు. ఈ విగ్రహాలు కేవలం ఎవరో చేతిపనివాడు చేసిన చెక్క, రాయి, లోహపు బొమ్మ మాత్రమే, వాటిని యెహోవా అసహ్యించుకొంటాడు.’ “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 16 “అప్పుడు లేవీయులు ‘తన తల్లినిగానీ తండ్రిని గానీ గౌరవించటం లేదని సూచించే పనులు చేసేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 17 “అప్పుడు లేవీయులు ‘తన పొరుగువాని సరిహద్దు రాయి తొలగించినవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 18 “అప్పుడు లేవీయులు ‘గుడ్డివాడు, దారి తప్పి పోయేటట్టు నడిపించేవాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 19 “అప్పుడు లేవీయులు ‘విదేశీయులకు, అనాథలకు, విధవలకు న్యాయంగా తీర్పు చెప్పనివాడు శాప గ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 20 “అప్పుడు లేవీయులు, ‘ఒకడు తన తండ్రి భార్యతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటం, తన తండ్రిని దిగంబరునిగా చేయటమే గనుక వాడు శాపగ్రస్థుడు’ అని చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 21 “‘ఏ జంతువుతోనైనా లైంగిక సంపర్కం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 22 “‘తన సోదరితోగాని, తన తండ్రి కుమార్తెతోగాని, తన తల్లి కుమార్తెతోగాని లైంగిక సంబంధం గలవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చేప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 23 “‘తన అత్తగారితో లైంగిక సంబంధం ఉన్నవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 24 “అతడు పట్టుబడనప్పటికీ ‘రహస్యంగా మరొకడ్ని చంపినవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అందుకు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 25 “‘నిర్దోషిని ఒకణ్ణి చంపటానికి డబ్బు తీసుకొనేవాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. 26 “‘ధర్మశాస్త్రాన్ని బలపర్చకుండా, దీనికి విధేయుడు కానివాడు శాపగ్రస్థుడు’ అని లేవీయులు చెప్పాలి. “అప్పుడు ప్రజలంతా ‘ఆమెన్’ అని చెప్పాలి. |
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Bible League International