Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 రాజులు 22 - పవిత్ర బైబిల్


యోషీయా యూదాలో తన పరిపాలన ప్రారంభించుట

1 యోషీయా పరిపాలనకు వచ్చేనాటికి, అతను ఎనిమిదేండ్లవాడు. యెరూషలేములో అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కతుకి చెందిన అదయా కుమార్తె.

2 యెహోవా మంచివని చెప్పిన పనులు యోషీయా జరిగించాడు. తన పూర్వికుడైన దావీదు వలె, యోషీయా దేవుని అనుసరించాడు. దేవుడు ఆశించిన విధంగా యోషియా దేవుని బోధనలు పాటించాడు.


ఆలయ మరమ్మతుకి యోషీయా ఆజ్ఞాపించుట

3 యోషీయా రాజుగా వున్న 18వ సంవత్సరాన, అతను కార్యదర్శి అయిన మెఘల్లాము కొడుకైన అజల్యా కుమారుడు షాఫానును యెహోవా యొక్క ఆలయానికి పంపాడు.

4 “ప్రధాన యాజకుడు అయిన హిల్కీయా వద్దకు వెళ్లుము. యెహోవా ఆలయానికి ప్రజలు తీసుకువచ్చిన ధనాన్ని ఎంచమని చెప్పుము. ప్రజల వద్దనుంచి ద్వారపాలకులు ఆ ధనము వసూలు చేశారు.

5 యెహోవా ఆలయము మరమ్మతుల కోసము పనివారికి ఆ ధనాన్ని యాజకులు వినియోగించాలి. యెహోవా ఆలయాన్ని పర్యవేక్షించే వారికి యాజకులు ఆ డబ్బు ఇవ్వాలి.

6 ఆ డబ్బును వడ్రంగులకు, రాయి బ్రద్దలు చేసేవారికి, రాతి పనివారికి ఆ డబ్బు ఉపయోగించబడాలి. ఆలయము కోసము కలపకొనేందుకు రాళ్లు కొనేందుకు ఆ డబ్బు వినియోగము కావాలి.

7 పనివారికి ఇచ్చే ధనాన్ని లెక్కించవద్దు. పనివారు నమ్మదగిన వారు” అని యోషీయా చెప్పాడు.


ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుట

8 ప్రధాన యాజకుడైన హిల్కీయా కార్యదర్శి అయిన షాఫానుతో, “యెహోవా ఆలయములో నేను ధర్మశాస్త్ర గ్రంథము కనుగొన్నాను” అని చెప్పాడు. హిల్కీయా ఆ పుస్తకము షాఫానుకి ఇవ్వగా, షాఫాను అది చదివాడు.

9 కార్యదర్శి షాఫాను యోషీయా రాజు వద్దకు పోయి జరిగిన విషయము చెప్పాడు. “నీ సేవకులు ఆలయములో వున్న ధనమునంతా పోగుజేశారు. యెహోవా ఆలయాన్ని పరీక్షించేవారికి ఆ ధనమును వారు ఇచ్చివేశారు.” అని షాఫాను చెప్పాడు.

10 తర్వాత షాఫాను కార్యదర్శి రాజుతో, “మరియు ప్రధాన యాజకుడు హిల్కీయా నాకు ఈ గ్రంథము ఇచ్చాడు” అని పలికాడు. తర్వాత షాఫాను రాజుకు ఆ పుస్తకము చదివి వినిపించాడు.

11 రాజు ఆ ధర్మశాస్త్ర గ్రంథములోని మాటలు వినగానే, తాను తలక్రిందులైనాననీ, విచారం చెందినాననీ తెలిపేందుకు తన వస్త్రాలు చింపుకొన్నాడు.

12 తర్వాత రాజు యాజకుడు హిల్కీయాకు కార్యదర్శి షాఫానుకు, అతని కుమారుడు అహీకాముకు, మీకాయా కుమారుడు అక్బోరుకు, రాజు సేవకుడు అశాయాకు ఆజ్ఞ ఇచ్చాడు.

13 యోషీయా రాజు, “వెళ్లి మనమేమి చేయాలో యెహోవాని అడుగు. నా కోసము, ప్రజల కోసము, యూదా మొత్తానికి యెహోవాని అడుగుము. ఈ పుస్తకములోని మాటలు గురించి అడుగు. యెహోవా మనపట్ల కోపంగా వున్నాడు. మన పూర్వీకులు ఈ పుస్తకములోని మాటలు పాటించక పోవడంవల్ల. మనకోసము వ్రాయబడిన అన్ని ఆజ్ఞలను మనము పాటించలేదు” అని చెప్పాడు.


యోషీయా మరియు ప్రవక్త్రి అయిన హుల్దా

14 అందువల్ల హిల్కీయా యాజకుడు, అహికాము, అక్బోరు, షాఫాను మరియు అశాయా స్త్రీ ప్రవక్త అయిన హుల్దా వద్దకు వెళ్లారు. హర్హను కుమారుడు తిక్వా కుమారుడైన షల్లూము భార్యయే హుల్దా. అతను యాజకుల వస్త్రాలను జాగరూకతతో చూస్తున్నాడు. హుల్దా యెరూషలేములో రెండవ ప్రదేశంలో నివసిస్తున్నది. వారు హుల్దా వద్దకు పోయి మాట్లాడారు.

15 తర్వాత హుల్దా వారితో ఇలా చెప్పింది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుచున్నాడు. నా వద్దకు పంపిన మనిషితో చెప్పు.

16 యెహోవా ఇలా చెప్పుచున్నాడు. ఇక్కడ నివసించే ప్రజలకు, ఈ స్థలానికి నేను ఇబ్బంది తెస్తున్నాను. యూదా రాజు చదివిన పుస్తకములో ఈ కష్టాలు లేక ఇబ్బందులు సూచించబడ్డవి.

17 యూదా ప్రజలు నన్ను విడిచి పెట్టారు. ఇతర దేవుళ్లకు ధూపము వేశారు. వారు నాకు మహా కోపము తెప్పించారు. వారు ఎక్కువ విగ్రహాలు తయారు చేశారు. అందువల్ల ఈ స్ధలము పట్ల నా కోపమును ప్రదర్శిస్తాను. నా కోపము ఆర్పశక్యము కానట్టి నిప్పు వంటిది.”

18-19 “యూదా రాజైన యోషీయా యెహోవా యొక్క సలహా తెలుసుకొనుమని నిన్ను పంపాడు. యోషీయాకు విషయాలు చెప్పు. నీవు వినే ఈ మాటలు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చాడు. నేనీ స్థలమును గురించీ, ఇక్కడ నివసించే వారిని గురించీ చెప్పిన మాటలు నీవు విన్నావు. నీ హృదయము మృదువైనది. ఈ విషయాలు వినగానే నీవు విచారించావు. ఈ ప్రదేశానికి (యెరూషలేము) భయంకర సంఘటనలు జరుగుతాయని నేను చెప్పాను. నీ విచారాన్ని తెలుపడానికి నీ వస్త్రాలు చింపావు. నీవు విలపించ సాగావు. అందువల్లనే నేను విన్నాను. యెహోవా ఇది చెప్పుచున్నాడు.

20 నీ పూర్వికులతో వుండడానికి నేను నిన్ను తీసుకువస్తాను. నీవు మరణిస్తావు. ప్రశాంతంగా నీవు నీ సమాధి చేరతావు. అందువల్ల నేను ఈ ప్రదేశానికి (యెరూషలేము) తెచ్చు కష్టాలను నీ కండ్లు చూడవు.” అప్పుడు యాజకుడు హిల్కీయా, అహికాము, అక్బోరును, షాఫాను, మరియు యోషీయా రాజుకు ఆ సందేశము చెప్పారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ