Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

2 యోహాను 1 - పవిత్ర బైబిల్

1 దేవుడు ఎన్నుకున్న అమ్మగారికి, ఆమె సంతానానికి, పెద్దనైన నేను వ్రాస్తున్నది ఏమనగా,

2 మీ పట్ల నాకు నిజమైన ప్రేమవుంది. సత్యం మాలో శాశ్వతంగా ఉంది కాబట్టే, నాకే కాకుండా సత్యం తెలిసిన వాళ్ళందరికీ మీ పట్ల ప్రేమ ఉంది.

3 తండ్రి అయిన దేవుడు, తండ్రి యొక్క కుమారుడైన యేసు క్రీస్తు మనకు సత్యంతో, ప్రేమతో ఇచ్చిన కృప, దయ, శాంతి మనలో ఉండాలని కోరుతున్నాను.

4 మీ సంతానంలో కొందరు, తండ్రి ఆజ్ఞాపించినట్లు నిజాయితీగా జీవిస్తున్నారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది.

5 అమ్మా! మొదటినుండి ఉన్న ఆజ్ఞనే నేను మీకు వ్రాస్తున్నాను కాని, క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మనము పరస్పరం ప్రేమతో ఉండాలని అంటున్నాను.

6 ఆయన ఆజ్ఞల్ని విధేయతతో పాటించటమే ప్రేమ. మీరు మొదటి నుండి విన్నట్లు, ప్రేమతో జీవించుమని ఆయన ఆజ్ఞాపించాడు.

7 యేసు క్రీస్తు శరీరంతో రాలేదనే మోసగాళ్ళు చాలామంది ఈ ప్రపంచంలో వ్యాపించారు. వాళ్ళు మోసగాళ్ళు; క్రీస్తు విరోధులు.

8 పని చేయటంవల్ల లభించే ఫలాన్ని వదులుకోకుండా జాగ్రత్త పడండి. సంపూర్ణమైన ఫలం లభించేటట్లు చూసుకోండి.

9 క్రీస్తు ఉపదేశాన్ని ఉల్లంఘించినవానిపై దేవుని అనుగ్రహం ఉండదు. ఆ ఉపదేశానుసారం నడుచుకొనేవానిపై తండ్రి, కుమారుల అనుగ్రహం ఉంటుంది.

10 ఈ ఉపదేశం తమ వెంట తీసుకురాకుండా మీ దగ్గరకు వచ్చినవాణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకండి. అలాంటివాణ్ణి పలుకరించకండి.

11 ఎవరైనా అలాంటివాణ్ణి పలుకరిస్తే, ఆ పలుకరించబడినవాడు చేసిన చెడ్డ పనుల్లో అతడు కూడ భాగస్థుడౌతాడు.

12 నాకింకా ఎన్నో విషయాలు వ్రాయాలని ఉంది. కాని కాగితాన్ని, సిరాను ఉపయోగించటం నాకు యిష్టం లేదు. నేను మిమ్మల్ని కలిసి ముఖాముఖి మీతో మాట్లాడటానికి ఎదురు చూస్తున్నాను. అప్పుడు మనకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.

13 దేవుడు ఎన్నుకొన్న మీ సోదరి యొక్క సంతానం, వాళ్ళ అభివందనాలు మీకు తెలుపుతున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 1997 Bible League International

Bible League International
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ