Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

జెకర్యా 2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మరియు నేను తేరిచూడగా కొలనూలు చేతపట్టుకొనిన యొకడు నాకు కనబడెను.

2 నీ వెక్కడికి పోవు చున్నావని నేనతని నడుగగా అతడు–యెరూషలేముయొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచిచూడ బోవుచున్నాననెను.

3 అంతట నాతో మాటలాడుచున్న దూత బయలుదేరగా మరియొక దూత యతనిని ఎదుర్కొనవచ్చెను.

4 రెండవ దూత – పరుగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులును పశువులును విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యౌవనునికి తెలియజేయుమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను.

5 నేను దానిచుట్టు అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దానిమధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును; ఇదే యెహోవా వాక్కు.

6 ఉత్తర దేశములో ఉన్నవారలారా, తప్పించుకొని రండి; ఆకాశపు నాలుగు వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేసియున్నాను; ఇదే యెహోవా వాక్కు.

7 బబులోనుదేశములో నివాసివగు సీయోనూ, అచ్చటనుండి తప్పించుకొని పొమ్ము; ఇదే యెహోవా వాక్కు–.

8 సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.

9 నేను నా చేతిని వారిమీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు; అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.

10 సీయోను నివాసులారా, నేను వచ్చి మీమధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు.

11 ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.

12 మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును.

13 సకలజనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై యుండుడి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ