జెకర్యా 12 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దేవోక్తి ఇశ్రాయేలీయులనుగూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశమండలమును విశాలపరచి భూమికి పునాదివేసి మనుష్యుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చునదేమనగా 2 –నేను యెరూషలేమును చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును. 3 ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైనజనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు, భూజనులందరును దానికి విరోధులై కూడుదురు. 4 ఇదే యెహోవా వాక్కు–ఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారిమీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును. 5 అప్పుడు యెరూషలేములోని అధికారులు–యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుటవలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పు కొందురు. 6 ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరిని దహించుదురు. యెరూషలేమువారు ఇంకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. 7 మరియు దావీదు ఇంటి వారును యెరూషలేము నివాసులును, తమకు కలిగిన ఘనతనుబట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదావారిని మొదట రక్షించును. 8 ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్ష కుడుగా నుండును; ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదువంటివారుగాను, దావీదు సంతతివారు దేవునివంటి వారుగాను జనుల దృష్టికి యెహోవాదూతలవంటి వారుగాను ఉందురు. 9 ఆ కాలమున యెరూషలేముమీదికి వచ్చు అన్యజనులనందరిని నేను నశింపజేయ పూనుకొనెదను. 10 దావీదు సంతతివారిమీదను యెరూషలేము నివా సులమీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపనచేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నామీద దృిష్టయుంచి, యొకడు తన యేక కుమారుని విషయమై దుఃఖించునట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై యొకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలా పింతురు. 11 మెగిద్దోను లోయలో హదద్రిమ్మోనుదగ్గర జరిగిన ప్రలాపమువలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. 12 దేశనివాసులందరు ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు, దావీదు కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, 13 లేవి కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబికులు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను, 14 మిగిలిన వారిలో ప్రతి కుటుంబపువారు ప్రత్యేకముగాను, వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India