Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 9 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)


ప్రధానగాయకునికి. ముత్లబ్బేను అను రాగముమీద పాడదగినది. దావీదు కీర్తన.

1 నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను యెహోవా, నీ అద్భుతకార్యములన్నిటిని నేను వివ రించెదను.

2 మహోన్నతుడా, నేను నిన్నుగూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను.

3 నీవు నా పక్షమున వ్యాజ్యెమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నావు

4 కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్లుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు.

5 నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసి యున్నావు వారి పేరు ఎన్నటికి నుండకుండ తుడుపు పెట్టి యున్నావు.

6 శత్రువులు నశించిరి, వారు ఎన్నడు నుండకుండ నిర్మూలమైరి నీవు పెల్లగించిన పట్టణములు స్మరణకు రాకుండ బొత్తిగా నశించెను.

7 యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు.

8 యెహోవా నీతినిబట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతనుబట్టి ప్రజలకు న్యాయము తీర్చును.

9 నలిగినవారికి తాను మహా దుర్గమగును ఆపత్కాలములలో వారికి మహా దుర్గమగును

10 యెహోవా, నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచి పెట్టువాడవు కావు కావున నీ నామమెరిగినవారు నిన్ను నమ్ముకొందురు

11 సీయోను వాసియైన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి.

12 ఆయన రక్తాపరాధమునుగూర్చి విచారణచేయునప్పుడు బాధపరచబడువారిని జ్ఞాపకము చేసికొనును వారి మొఱ్ఱను ఆయన మరువడు.

13 నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధిచేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణనుబట్టి హర్షించునట్లు యెహోవా, నన్ను కరుణించుము.

14 మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించు వాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధను చూడుము.

15 తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.

16 యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చి యున్నాడు. దుష్టులు తాముచేసికొనినదానిలో చిక్కియున్నారు (హిగ్గాయోన్ సెలా.)

17 దుష్టులును దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు.

18 దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడువారి నిరీక్షణాస్పదము ఎన్నటికిని నశించదు.

19 యెహోవా లెమ్ము, నరులు ప్రబలక పోవుదురు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురు గాక.

20 యెహోవా, వారిని భయపెట్టుము తాము నరమాత్రులమని జనులు తెలిసికొందురు గాక. (సెలా.)

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ