కీర్తన 57 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)ప్రధానగాయకునికి. అల్ తష్హేతు అను రాగముమీద పాడదగినది. గుహలో దావీదు సౌలునొద్దనుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది. అనుపదగీతము. 1 నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ శరణుజొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చియున్నాను. 2 మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలముచేయు దేవునికి నేను మొఱ్ఱ పెట్టుచున్నాను. 3 ఆయన ఆకాశమునుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మ్రింగగోరువారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. (సెలా.) 4 నా ప్రాణము సింహములమధ్య నున్నది కోపోద్రేకులమధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులువారి నాలుక వాడిగల కత్తి. 5 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము. 6 నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వలయొడ్డిరి నా ప్రాణము క్రుంగియున్నది. నా యెదుట గుంట త్రవ్వి దానిలో తామేపడిరి. (సెలా.) 7 నా హృదయము నిబ్బరముగా నున్నది దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను. 8 నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను. 9 నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది. 10 ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను. 11 దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India