Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

కీర్తన 44 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)


ప్రధానగాయకునికి కోరహు కుమారులు చేసినది. దైవధ్యానము.

1 దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసినపనినిగూర్చి మేము చెవులార విని యున్నాము మా పితరులు దానిని మాకు వివరించిరి

2 నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

3 వారు తమ ఖడ్గముచేత దేశమును స్వాధీనపరచు కొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణహస్తమే నీ బాహువే నీ ముఖకాంతియేవారికి విజయము కలుగజేసెను.

4 దేవా, నీవే నా రాజవు యాకోబునకు పూర్ణరక్షణ కలుగ నాజ్ఞాపించుము.

5 నీవలన మా విరోధులను అణచివేయుదుము నీ నామమువలననే, మామీదికి లేచువారిని మేము త్రొక్కి వేయుదుము.

6 నేను నా వింటిని నమ్ముకొనను నా కత్తియు నన్ను రక్షింపజాలదు

7 మా శత్రువుల చేతిలోనుండి మమ్మును రక్షించు వాడవు నీవే మమ్మును ద్వేషించువారిని సిగ్గుపరచువాడవు నీవే.

8 దినమెల్ల మేము దేవునియందు అతిశయపడుచున్నాము నీ నామమునుబట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. (సెలా.)

9 అయితే ఇప్పుడు నీవు మమ్మును విడనాడి అవమాన పరచియున్నావు. మాసేనలతోకూడ నీవు బయలుదేరకయున్నావు.

10 శత్రువులయెదుట నిలువకుండ మమ్మును వెనుకకు పారిపోజేయుచున్నావు మమ్మును ద్వేషించువారు ఇష్టమువచ్చినట్లు మమ్మును దోచుకొనుచున్నారు.

11 భోజనపదార్థముగా ఒకడు గొఱ్ఱెలను అప్పగించునట్లు నీవు మమ్మును అప్పగించియున్నావు అన్యజనులలోనికి మమ్మును చెదరగొట్టి యున్నావు

12 అధికమైన వెల చెప్పక ధనప్రాప్తిలేకయే నీవే నీ ప్రజలను అమ్మి యున్నావు

13 మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మును నిందాస్పద ముగా చేసియున్నావు మా చుట్టు నున్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణ ముగాను మమ్మును ఉంచియున్నావు.

14 అన్యజనులలో మమ్మును సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మును ఉంచియున్నావు.

15-16 నన్ను నిందించి దూషించువారి మాటలు వినగా శత్రువులనుబట్టియు పగ తీర్చుకొనువారినిబట్టియు నేను దినమెల్ల నా అవమానమును తలపోయుచున్నాను సిగ్గు నా ముఖమును కమ్మియున్నది.

17 ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు.

18 మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు.

19 అయితే నక్కలున్నచోట నీవు మమ్మును బహుగా నలిపియున్నావు గాఢాంధకారముచేత మమ్మును కప్పియున్నావు

20 మా దేవుని నామమును మేము మరచియున్నయెడల అన్యదేవతలతట్టు మా చేతులు చాపియున్నయెడల

21 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా?

22 నిన్నుబట్టి దినమెల్ల మేము వధింపబడుచున్నాము వధకు సిద్ధమైన గొఱ్ఱెలమని మేము ఎంచబడు చున్నాము

23 ప్రభువా, మేల్కొనుము నీవేల నిద్రించుచున్నావు? లెమ్ము నిత్యము మమ్మును విడనాడకుము.

24 నీ ముఖమును నీ వేల మరుగుపరచియున్నావు? మా బాధను మాకు కలుగు హింసను నీవేల మరచి యున్నావు?

25 మా ప్రాణము నేలకు క్రుంగియున్నది మా శరీరము నేలను పెట్టియున్నది.

26 మా సహాయమునకు లెమ్ము నీ కృపనుబట్టి మమ్మును విమోచింపుము.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ