కీర్తన 17 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)దావీదు ప్రార్థన. 1 యెహోవా, న్యాయమును ఆలకించుము, నా మొఱ్ఱ నంగీకరించుము నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెద వులనుండి వచ్చునదికాదు. 2 నీ సన్నిధినుండి నాకు తీర్పు వచ్చునుగాక నీ కనుదృష్టి న్యాయముగా చూచును. 3 రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటిమాటచేత నేను అతిక్రమింపను 4 మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటిమాటనుబట్టి నన్ను నేను కాపాడుకొని యున్నాను. 5 నీ మార్గములయందు నా నడకలను స్థిరపరచుకొని యున్నాను. నాకు కాలు జారలేదు. 6 నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. 7 నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా, 8-9 నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనునట్లు నన్ను కాపాడుము నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువులచేత చిక్క కుండను నీ రెక్కల నీడక్రింద నన్ను దాచుము. 10 వారు తమ హృదయమును కఠినపరచుకొనియున్నారువారి నోరు గర్వముగా మాటలాడును. 11 మా అడుగుజాడలను గురుతుపెట్టి వారిప్పుడు మమ్ము చుట్టుకొని యున్నారు మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. 12 వారు చీల్చుటకు ఆతురపడు సింహమువలెను చాటైన స్థలములలో పొంచు కొదమసింహమువలెను ఉన్నారు. 13 యెహోవా లెమ్ము, వానిని ఎదుర్కొని వానిని పడ గొట్టుము దుష్టునిచేతిలోనుండి నీ ఖడ్గముచేత నన్ను రక్షింపుము 14 లోకులచేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావువారు కుమారులుకలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు. 15 నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనము చేసెదను నేను మేల్కొనునప్పుడు నీ స్వరూపదర్శనముతో నా ఆశను తీర్చుకొందును. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India