కీర్తన 137 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి. 2 వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగిలించితిమి. 3 అచ్చట మనలను చెరగొన్నవారు–ఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు –సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి 4 అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము? 5 యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక. 6 నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. 7 యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసికొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. –దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా. 8 పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు 9 నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India