నహూము 2 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము, 2 దోచుకొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును. 3 ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన యీటెలు ఆడుచున్నవి; 4 వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి, 5 రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు. 6 నదులదగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది. 7 నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు. 8 కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; –నిలువుడి నిలువుడి అనిపిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు. 9 వెండి కొల్లపట్టుడి, బంగారము కొల్లపట్టుడి, అది సకలవిధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేక యున్నవి. 10 అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి. 11 సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థలమేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమాయెను? 12 తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను? 13 నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మ్రింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India