మార్కు 5 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. 2 ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పెట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. 3 వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. 4 పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. 5 వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను. 6 వాడు దూరమునుండి యేసును చూచి, పరుగెత్తికొనివచ్చి, ఆయనకు నమస్కారముచేసి 7 –యేసూ, సర్వోన్నతుడైన దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. 8 ఎందుకనగా ఆయన–అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. 9 మరియు ఆయన–నీ పేరేమని వానినడుగగా వాడు–నా పేరు సేన, యేలయనగా మేము అనేకులమని చెప్పి 10 తమ్మును ఆ దేశములోనుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. 11 అక్కడ కొండదగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. 12 గనుక – ఆ పందులలో ప్రవేశించునట్లు మమ్మును వాటియొద్దకు పంపుమని, ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. 13 యేసు వాటికి సెలవియ్యగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు రెండువేల సంఖ్యగల ఆ మంద ప్రపాతమునుండి సముద్రపుదారిని వడిగా పరుగెత్తికొనిపోయి, సముద్రములో పడి ఊపిరి తిరుగక చచ్చెను. 14 ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. 15 జనులు జరిగినది చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పెట్టినవాడు బట్టలు ధరించుకొని, స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. 16 జరిగినది చూచినవారు దయ్యములు పెట్టినవానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియ జేయగా 17 తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలుకొనసాగిరి. 18 ఆయన దోనెయెక్కినప్పుడు, దయ్యములు పెట్టినవాడు ఆయనయొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని 19 ఆయన వానికి సెలవియ్యక–నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుమనెను. 20 వాడు వెళ్లి, యేసు తనకు చేసిన వన్నియు దెకపొలిలో ప్రకటింప నారంభింపగా అందరు ఆశ్చర్యపడిరి. 21 యేసు మరల దోనె యెక్కి అద్దరికి వెళ్లినప్పుడు బహుజనసమూహము ఆయనయొద్దకు కూడివచ్చెను. 22 ఆయన సముద్రతీరమున నుండగా సమాజమందిరపు అధికారులలో యాయీరను నొకడు వచ్చి, ఆయనను చూచి ఆయన పాదములమీదపడి 23 –నా చిన్నకుమార్తె చావనై యున్నది; అది బాగుపడి బ్రదుకునట్లు నీవు వచ్చి దానిమీద నీచేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా 24 ఆయన అతనితోకూడ వెళ్లెను; బహుజనసమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 25 పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి 26 తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకట పడెను. 27-28 ఆమె యేసునుగూర్చి విని–నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని, జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. 29 వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. 30 వెంటనే యేసు తనలోనుండి ప్రభావము బయలువెళ్లెనని తనలోతాను గ్రహించి, జనసమూహమువైపు తిరిగి–నా వస్త్రములు ముట్టిన దెవరని అడుగగా 31 ఆయన శిష్యులు –జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే; నన్నుముట్టినదెవడని అడుగుచున్నావా? అనిరి. 32 ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టు చూచెను. 33 అప్పుడా స్త్రీ తనకు జరిగినది యెరిగి, భయపడి, వణకుచువచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి యంతయు ఆయనతో చెప్పెను. 34 అందుకాయన – కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పెను. 35 ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చి–నీ కుమార్తె చనిపోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు వనిరి. 36 యేసు వారు చెప్పినమాట లక్ష్యపెట్టక–భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజమందిరపు అధికారితో చెప్పి 37 పేతురు, యాకోబు, యాకోబు సహోదరుడగు యోహాను అనువారిని తప్ప మరి ఎవరినైనను తన వెంబడి రానియ్యక 38 సమాజమందిరపు అధికారి యింటికి వచ్చి, వారు గొల్లుగానుండి చాల యేడ్చుచు, ప్రలాపించుచు నుండుట చూచి 39 లోపలికిపోయి– మీరేల గొల్లుచేసి యేడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించు చున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పెను. 40 అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరిని బయటకు పంపివేసి, ఆ చిన్నదాని తలిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని, ఆ చిన్నది పరుండి యున్న గదిలోనికి వెళ్లి 41 ఆ చిన్నదాని చెయిపెట్టి– తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. 42 వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను; ఆమె పండ్రెండు సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. 43 జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India