Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

మత్తయి 8 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను.

2 ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి–ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను.

3 అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి–నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి యాయెను.

4 అప్పుడు యేసు–ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను.

5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి

6 –ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను.

7 యేసు –నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా

8 ఆ శతాధిపతి–ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును.

9 నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను.

10 యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి–ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.

11 అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతోకూడను, ఇస్సాకుతోకూడను, యాకోబుతోకూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని

12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాననెను.

13 అంతట యేసు – ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.

14 తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి, జ్వరముతో పడియున్న అతని అత్తను చూచి

15 ఆమె చెయ్యిముట్టగా జ్వరమామెను విడిచెను; అంతట ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను.

16 సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

17 ఆయన మాటవలన దయ్యములను వెళ్ల గొట్టి రోగులనెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తయైన యెషయాద్వార చెప్పబడినది నెరవేరెను.

18 యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్లవలెనని ఆజ్ఞాపించెను.

19 అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీ వెక్కడికి వెళ్లినను నీ వెంటవచ్చెదనని ఆయనతో చెప్పెను.

20 అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.

21 శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్లి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా

22 యేసు అతని చూచి–నన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను.

23 ఆయన దోనె యెక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్లిరి.

24 అంతట సముద్రముమీద తుపాను లేచి నందున ఆ దోనె అలలచేత కప్పబడెను. అప్పుడాయన నిద్రించుచుండగా

25 వారు ఆయన యొద్దకు వచ్చి– ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి.

26 అందుకాయన అల్పవిశ్వాసులారా, యెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళ మాయెను.

27 ఆ మనుష్యులు ఆశ్చర్యపడిఈయన ఎట్టివాడో; ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి.

28 ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన యిద్దరు మనుష్యులు సమాధులలోనుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్లలేక పోయెను.

29 వారు–ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా? అని కేకలువేసిరి.

30 వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా

31 ఆ దయ్యములు –నీవు మమ్మును వెళ్లగొట్టినయెడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను.

32 ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదలిపెట్టి ఆ పందులలోనికి పోయెను; ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడిచచ్చెను.

33 వాటిని మేపుచున్నవారు పారిపోయి పట్టణములోనికి వెళ్లి జరిగిన కార్యములన్నియు దయ్యములు పెట్టినవారి సంగతియు తెలిపిరి.

34 ఇదిగో ఆ పట్టణస్థులందరు యేసును ఎదుర్కొనవచ్చి ఆయనను చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ