మత్తయి 23 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను 2 –శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు 3 గనుక–వారు మీతో చెప్పువాటినన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలచొప్పున చేయకుడి; వారు చెప్పుదురే గాని చేయరు. 4 మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు. 5 మనుష్యులకు కనబడునిమిత్తము తమ పనులన్నియు చేయుదురు; తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు; 6 విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను 7 సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. 8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు. 9 మరియు భూమిమీద ఎవనికైనను తండ్రి అని పేరుపెట్టవద్దు; ఒక్కడే మీ తండ్రి; ఆయన పరలోకమందున్నాడు. 10 మరియు మీరు గురువులని పిలువబడవద్దు; క్రీస్తు ఒక్కడే మీ గురువు. 11 మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. 12 తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. 13-14 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. 15 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. 16 అయ్యో, అంధులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయముతోడని ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దేవాలయములోని బంగారముతోడని ఒట్టు పెట్టుకొంటె వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. 17 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? బంగారమా, బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? 18 మరియు బలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె, అందులో ఏమియు లేదు గాని, దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. 19 అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది? అర్పణమా, అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? 20 బలిపీఠముతోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. 21 మరియు దేవాలయము తోడని ఒట్టుపెట్టుకొనువాడు, దాని తోడనియు అందులో నివసించువాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. 22 మరియు ఆకాశముతోడని ఒట్టుపెట్టుకొనువాడు దేవుని సింహాసనముతోడనియు దానిపైని కూర్చున్నవాని తోడనియు ఒట్టుపెట్టుకొనుచున్నాడు. 23 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను. 24 అంధులైన మార్గదర్శకులారా, దోమలేకుండునట్లు వడియగట్టి ఒంటెను మ్రింగువారు మీరే. 25 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి. 26 గ్రుడ్డిపరిసయ్యుడా, గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధియగునట్టుగా ముందు వాటిలోపల శుద్ధిచేయుము. 27 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నముకొట్టిన సమాధులను పోలి యున్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవి. 28 ఆలాగే మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగా నగపడుచున్నారు గాని, లోపల వేషధారణతోను అక్రమముతోను నిండి యున్నారు. 29 అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతిమంతుల గోరీలను శృంగారించుచు 30 –మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. 31 అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. 32 మీరును మీపితరుల పరిమాణము పూర్తి చేయుడి. 33 సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు? 34 అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపుచున్నాను; మీరు వారిలో కొందరిని చంపి సిలువవేయుదురు, కొందరిని మీ సమాజమందిరములలో కొరడాలతో కొట్టి, పట్టణమునుండి పట్టణమునకు తరుముదురు. 35 నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును, దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జెకర్యా రక్తమువరకు భూమిమీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. 36 ఇవన్నియు ఈ తరమువారిమీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 37 యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచునుఉండు దానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చు కొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చు కొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. 38 ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది. 39 ఇదిమొదలుకొని– ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India