యోబు 10 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను 2 నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను. 3 దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచనమీద దయాదృష్టియుంచుట సంతోషమా? నీ హస్తకృత్యములను తృణీకరించుట నీకు సంతోషమా? 4 నీ నేత్రములు నరుల నేత్రములవంటివా? నరులు ఆలోచించునట్లు నీవు ఆలోచించు వాడవా? 5 నీ జీవితకాలము నరుల జీవిత కాలమువంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? 6 నేను దోషిని కాననియు 7 నీ చేతిలోనుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగియుండియు నీవేల నా దోషమునుగూర్చి విచారణచేయు చున్నావు? నా పాపమును ఏల వెదకుచున్నావు? 8 నీ హస్తములు నాకు అవయవ నిర్మాణముచేసి నన్ను రూపించియున్నను నీవు నన్ను మ్రింగివేయుచున్నావు. 9 జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా? 10 ఒకడు పాలుపోసినట్లు నీవు నన్ను పోసితివిగదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేర బెట్టితివి గదా. 11 చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. 12 జీవము ననుగ్రహించి నాయెడల కృప చూపితివి నీ సంరక్షణచేత నా ఆత్మను కాపాడితివి. 13 అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయ ములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. 14 నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు. 15 నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధ కలుగును నేను నిర్దోషినైయుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. 16 నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు 17 ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. 18 గర్భములోనుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి? అప్పుడే యెవరును నన్ను చూడకుండ నేను ప్రాణము విడిచి యుండినయెడల మేలు; 19 అప్పుడు నేను లేనట్లే యుండియుందును గర్భములోనుండి సమాధికి కొనిపోబడియుందును. 20 నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు 21 అంధకారము మరణాంధకారముగల దేశమునకు 22 కటికచీకటియై గాఢాంధకారమయమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు వెలుగే చీకటిగాగల దేశమునకు నేను వెళ్లక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India