Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -

న్యాయాధి 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక

2 యెహోవా హాసోరులో ఏలు కనానురాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.

3 అతనికి తొమ్మిదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.

4 ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను.

5 ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి.

6 ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవువెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;

7 నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా

8 బారాకు –నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదనుగాని నీవు నాతోకూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.

9 అప్పుడు ఆమె–నీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవుచేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతోకూడ కెదెషునకు వెళ్లెను.

10 బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;

11 దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను.

12 అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన తొమ్మిదివందల ఇనుప రథములను

13 అన్యుల హరోషెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా

14 దెబోరా–లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండమీదినుండి దిగి వచ్చెను.

15 బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను.

16 బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు

17 హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.

18 అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి –నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను.

19 ఆమె గొంగళితో అతని కప్పగా అతడు–దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా

20 అతడు–గుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చి–యిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవు –ఎవడును లేడని చెప్పవలెననెను.

21 పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టుకొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా

22 అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి–రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపిం చెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడియుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను.

23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనానురాజైన యాబీనును అణచెను.

24 తరువాత వారు కనానురాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనానురాజైన యాబీనుకు విరోధముగా అంత కంతకు హెచ్చుచువచ్చెను.

Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible

Copyright © 2016 by The Bible Society of India

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
ကြှနျုပျတို့နောကျလိုကျပါ:



ကြော်ငြာတွေ