యాకోబు 4 - పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? 2 మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు. 3 మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకైదురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమియు దొరకుటలేదు. 4 వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. 5 –ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా? 6 కాదుగాని, ఆయన ఎక్కువ కృప నిచ్చును; అందుచేత–దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. 7 కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. 8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రముచేసికొనుడి; ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. 9 వ్యాకుల పడుడి, దుఃఖపడుడి, యేడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. 10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. అప్పుడాయన మిమ్మును హెచ్చించును. 11 సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పుతీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినయెడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవుకాక న్యాయము విధించు వాడవైతివి. 12 ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై యున్నాడు; పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? 13 –నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్లి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారముచేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొనువారలారా, 14 రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. 15 కనుక–ప్రభువు చిత్తమైతే మనము బ్రదికి యుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. 16 ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. 17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. |
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India